Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రమోషన్ల షెడ్యూల్‌ను ప్రకటించాలి
- యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పారుపల్లి
నవతెలంగాణ- సత్తుపల్లి
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు పెరుగుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఉపాధ్యాయ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని తెలంగాణ స్టేట్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) జిల్లా ప్రధాన కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక మదర్ థెరెసా టెక్నో స్కూలులో జరిగిన ఆ సంఘ సత్తుపల్లి మండల మహాసభలో నాగేశ్వరరావు ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు, విద్యాబోధన జరుగుతుందని ఎంతో ఆశతో విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్నారన్నారు. గత తొమ్మిదేండ్ల నుంచి ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతుల ప్రక్రియను భర్తీ చేయకపోవడంతో జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉపాధ్యాయ ఖాళీలను భర్తీచేసి సమస్యను పరిష్కరించాలన్నారు. దీంతో పాటు పెండింగ్‌లో ఉన్న 3 డీఏల బకాయిలను చెల్లించాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. పండిట్, పీఈటీ అప్గ్రేడేషన్ను చేపట్టాలని నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. బదిలీలు, ప్రమోషన్ల షెడ్యూల్‌ను ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. సభ ప్రారంభానికి ముందు సంఘ పూర్వ రాష్ట్ర అధ్యక్షులు దివంగత నాగటి నారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంఘ మండల అధ్యక్షుడు బాల నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో జిల్లా కార్యదర్శులు జీఎస్ఆర్ రమేశ్, కె.నిర్మలకుమారి, ఆడిట్ కమిటీ కన్వీనర్ కె.వెంకటేశ్వరరావు (కేవీ), ప్రధాన కార్యదర్శి కొప్పుల శ్రీనివాసరావు, జిల్లా మాజీ కార్యదర్శులు చెరుకు శ్రీనివాసరావు పాల్గొన్నారు.