Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మిక సంఘాలన్నీ కలిసి ఐక్యంగా పోరాటం చేయాలి
- మంద నరసింహారావు
నవతెలంగాణ-ఇల్లందు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బ్లాక్‌లో రాకుండా చేస్తుంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్న బ్లాకులను ప్రయివేటుపరం చేస్తుందని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జేబీసీసీఐ మెంబర్ మంద నరసింహారావు విమర్శించారు. జెకెఓసిలో ఆదివారం ఫిట్ మీటింగ్ నిర్వహించారు. అనంతరం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జెకె 5 ఓపెన్ కాస్ట్(పూసపల్లి) ఎక్స్టెన్షన్ బ్లాక్ పనులు సింగరేణి చేపట్టాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో అనేక బ్లాకులకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా టెండర్ల ద్వారా ప్రయివేటు వారికి దారాదత్తం చేస్తుందన్నారు. అందులో భాగంగా ఇప్పటికే సింగిల్ టెండర్ వేసిన కోయగూడెం త్రీ బ్లాకును ప్రైవేటు వారికి అక్రమ మార్గంగా అన్ని నిబంధనలను తుంగలో తొక్కి ఇవ్వటం దారుణం అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జెకె 5 ఓపెన్ కాస్ట్ ఎక్స్టెన్షన్ బ్లాకు పూసపల్లి ఓపెన్ కాస్ట్‌ను సింగరేణి యాజమాన్యం చేపట్టకుండా బొగ్గు తీసే పనులతో సహా ప్రయివేటు వారికి అప్పగించేందుకు సింగరేణి యాజమాన్యం ప్రయత్నిస్తున్నదని ఈ చర్యలను తక్షణం విస్తరించుకోవాలని అన్నారు. దీనివల్ల సింగరేణి పుట్టినిల్లు అయినటువంటి ఇల్లందు మనుగడకే ప్రమాదం ఏర్పడే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయన్నారు. ఇక్కడ పనిచేస్తున్న కార్మికులను ఇతర ప్రాంతాలకు అతి తొందరలో బదిలీ చేయుటకు సింగరేణి యాజమాన్యం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తున్నదని అన్నారు. ఇప్పటికే సింగరేణిలో అనేక ఏరియాలలో ప్రస్తుతం నడుస్తున్న, కాజీపేట టూ లాంటి బ్లాకులు ప్రైవేటు వారికి అప్పగిస్తున్న నేపథ్యంలో ఈ కార్మికులను ఎక్కడ సర్దుబాటు చేస్తారో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతున్నదని అన్నారు. సింగరేణికి గుదిబండగా ఉన్న అడ్రియాల లాంగువాల్ ప్రాజెక్టు వేలకోట్ల రూపాయల నష్టాలతో నడుస్తున్న దానిని కొంతమంది అధికారులు తమ కమిషన్ల కోసం కక్కుర్తి పడి నష్టాలతో నడిపిస్తున్న నేపథ్యంలో ఇల్లందు ఏరియాలో పూసపల్లి ఓపెన్ కాస్ట్ నడపటం వల్ల నష్టాలు వస్తాయని పేరుతో ప్రైవేటు వారికి అప్పజెప్పటం ఎంతవరకు సమంజసమని అన్నారు. ఒకపక్క కేంద్ర ప్రభుత్వం బ్లాగులు రాకుండా చేస్తుంటే ఇంకొకపక్క రాష్ట్ర ప్రభుత్వం ఉన్న బ్లాకులను ప్రైవేటు వారికిచ్చే సింగరేణి యజమాన్య చర్యలను ఎలా సమర్థిస్తున్నదో శోచనీయమని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఇలాంటి చర్యలను తిరస్కరించాల్సిన అవసరం ఉన్నదని, లేకపోతే రాబోయే కాలంలో వీరందరికీ కార్మిక వర్గం తగిన గుణపాఠం చెబుతారని ఆయన పేర్కొన్నారు. వేతన ఒప్పంద చర్యలు ఆలస్యం కావడానికి కేంద్ర ప్రభుత్వ (డీపీఈ) డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కల్పించిన ఆటంకాలే ప్రధాన కారణమని నవంబర్‌లో జరగబోయే సమావేశంలోనైనా అలాంటి ఆటంకాలను పక్కన పెట్టి చర్చలు సఫలమయ్యేందుకు కేంద్ర ప్రభుత్వం, కోల్ ఇండియా యజమాన్యం చొరవ చూపాల్సిన అవసరం ఉందని ఆయన తెలియజేశారు. పిట్ మీటింగులో బ్రాంచ్ కార్యదర్శి ఎండి అబ్బాస్, రాష్ట్ర నాయకులు కుకట్ల శంకర్, బ్రాంచి నాయకులు సిరాజ్ అహ్మద్, సదానందం తదితరులు పాల్గొన్నారు.