Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వంత పొలంలోనే కూలీలుగా మారుతున్న రైతులు
నవతెలంగాణ-మణుగూరు
రైతే దేశానికి వెన్నెముక అని గల్లీ నుంచి ఢిల్లీ దాకా నాయకులు ఊకదంపుడు ఉపన్యాసాలకే పరిమితం అవుతున్నారే తప్పా, సమాజానికి అన్నం పెట్టే రైతన్నకు జరుగుతున్న అన్యాయాన్ని ఎవరూ ప్రశ్నించడం లేదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా వజ్రోత్సవాలు నిర్వహించుకున్నారు. వ్యవసాయ ప్రాధాన్యత గల భారతదేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రైతు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా రైతు జీవితం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే వేసినా చందంగా ఉన్నది. పినపాక నియోజకవర్గంలో పినపాక నియోజకవర్గంలోని మణుగూరు, అశ్వాపురం, పినపాక, కరకగూడెం, భూర్గంపహాడ్, మండలాల్లో ఫైర్టిలైజర్ షాపు యజమానులు, రైతు పండించే పంటను, రైతులను పీల్చీ పిప్పి చేస్తున్నారు. పంట చేతికి వచ్చే కాలానికి అప్పు తీరుతుందిలే అన్న సమయానికి ఫెర్టిలైజర్ షాపు యజమానులు తీసుకున్న అప్పుకి వడ్డికి, చక్రవడ్డీ పేరుతో మరింత అప్పు చూపుతున్నారు. తాతలు, తండ్రులు నాటి లెక్కలు చూపుతూ దైవంగా భాóవించే భూమిని బలవంతంగా లాక్కుంటున్నారు. నేలతల్లిని నమ్ముకుని ఆరుగాలం కష్టపడే రైతన్నలు భూములు లేకపోవడంతో చేసే గత్యంతరం లేక స్వంత భూమిలోనే కూలీలుగా మారుతున్నారు. ఫెర్టిలైజర్ షాపు యజమానులు పైసా పెట్టుబడి లేకుండా వడ్డీ పేరుతోటే భూములను లాక్కుంటూ వందలాది ఎకరాల భూములను తమ ఖాతాలో జమ చేసుకుంటున్నారు. పురుగుల మందులు, రసాయన ఎరువుల పేరుతో అధికధరలతో అంటగట్టి సంవత్సరానికి కోట్లల్లో అర్జిస్తున్నారు. ఆదివాసులు, దళితులు, బహుజనులు వారి వారి ఆర్దిక బలహీనతలను ఆసరాగా చేసుకోని ఆర్దిక దోపిడికి పాల్పడుతున్న నయా దోపిడిగాళ్లకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఒకవైపు ఆర్ధికమాంధ్యం, ద్రవ్యోల్బణం, ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక సంక్షభంలోకి నెట్టి వేయబడ్డది. గ్రామీణ ప్రాంతాలలో దీని ప్రభావం, ఫెర్టిలైజర్ షాపు యజమానుల దోపీడి వలన రైతులకు ఉపాధి లేకుండా పోతుంది. ఫెర్టిలైజర్ షాపు యజమానుల చేతిలో కోతమిషన్లు, ట్రాక్టర్లు, ఉంచుకోని రైతులకే కాకుండా వ్యవసాయ కూలీల జీవన భృతిపై తీవ్రంగా దెబ్బతీస్తున్నారు. ప్రభుత్వం రైతులకు సహాయం అందించేందుకు సహాకార సంఘాలు, కో ఆపరేటివ్ బ్యాంకులు, రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ సలహాలు ఇచ్చేందుకు రైతు వేదికలు నిర్వహించినప్పడికీ వీటి ఫలాలు దళారుల కారణంగా రైతులకు చేరడం లేదు. ఫెర్టిలైజర్ షాపు యజమానులే నారు పోసిన నుండి కోత కోసే వరకు రైతు వెన్నంటే ఉండి దోపిడికి పాల్పడుతున్నారు. తేనే పూసిన కత్తిలా మంచి మాటలు చెబుతూ రైతులను నట్టేటా ముంచుతున్నారు. ఫెర్టిలైజర్ షాపు యజమానుల దోపిడి నుండి రైతులను కాపాడాలని రైతులు, రైతు సంఘాలు కోరుతున్నారు.