Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆగ్రహించిన ఆదివాసీ ప్రజాప్రతినిధులు, నాయకులు
నవతెలంగాణ-ఆళ్ళపల్లి
మండల కేంద్రంలో ఆదివాసీ గూడెలు అన్ని కలిసి ఉత్సవంగా చేసుకోవలసిన కొమరం భీం విగ్రహ శంకుస్థాపనను ఆదివారం కొంత మంది గిరిజనేతరులు రాజకీయ లబ్ది కోసం నిర్వహించారని, సోమవారం మండలంలోని అనంతోగు, ముత్తాపురం, రాయిపాడు, రాయిగూడెం, రామాంజిగూడెం, తదితర ఆదివాసీ గ్రామాల్లో ఉవ్వెత్తున నిరసన జ్వాలలు ఎగిశాయి. మండలంలోని పలు మండల, గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అనంతోగు గ్రామంలో ఆదివాసీ నాయకురాలు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ.. మండలంలోని కొంత మంది గిరిజనేతరులు ఆదివాసీల ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా చేసిన హేయమైన చర్యను ప్రశ్నించాల్సిన గిరిజన నాయకులు, వత్తాసు పలకడానికి వ్యతిరేకంగా పలు గ్రామాల్లో ఆదివాసీ నాయకులు నేడు నిరసనల కార్యక్రమాలు చేయడం జరిగిందని తెలిపారు. ఆదివాసీ కొమరం భీం విగ్రహ శంకుస్థాపనకు స్థానిక ఆదివాసీ నాయకులు, ప్రజాప్రతినిధులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా స్వప్రయోజనాల కోసం విగ్రహ రాజకీయాలు చేయడం సరికాదన్నారు. ఇలాంటి రాజకీయాలు చేసే వారికి సరైన గుణపాఠం నేర్పిస్తామని హెచ్చరించారు. ఏ పార్టీల వారైనా గౌరవించి మాతో నడిస్తే ఒప్పుకుంటాం కానీ, ఆదివాసీలను విడగొట్టి రెండు, మూడు విగ్రహాలు పెట్టాలని, కమ్యూనిటీలో గొడవలు పెడితే ఊరుకోమని ఘాటుగా చెప్పారు. ఈ కార్యక్రమంలో రామాంజిగూడెం సర్పంచ్ పూనెం నిర్మల, రాయిపాడు సర్పంచ్ ఊకె ఈశ్వరి, అనంతోగు ఉప సర్పంచ్ బుచ్చి రాములు, రాయిగూడెం వార్డ్ మెంబర్ పాపారావు, జానీ, ఆదివాసీ నాయకులు భద్రం, ఊకె వసంతరావు, గోపి, చంద్రకళ, లక్ష్మి, నాగేశ్వరరావు, నరేష్, సారయ్య, నాగేష్, తదితరులు పాల్గొన్నారు.