Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెరిగిన ధరలకు అనుగుణంగా కూలిరేట్లు పెంచాలి
- వ్యకాస జిల్లా ప్రధాన కార్యదర్శి మచ్చా
నవతెలంగాణ-భద్రాచలం
వ్యవసాయ కార్మికుల కనీస వేతన జీవోను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమీక్ష చేయాలని, పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా వ్యవసాయ కూలీలకు కూలి రేట్లు పెంచాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. వ్యకాస పట్టణ ప్రథమ మహాసభ గడ్డం స్వామి అధ్యక్షతన జగదీష్ కాలనీలో సోమవారం జరిగింది. మహాసభ ప్రారంభానికి ముందు సంఘం జెండాను జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా హాజరైన మచ్చా మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడిన నాటినుంచి నేటి వరకు వ్యవసాయ కార్మికుల కనీస వేతన జీవోను సమీక్షించకపోవడం దారుణమని అన్నారు. కేంద్రంలోని బీజేపీ అమలుపరుస్తున్న విధానాల వల్ల రోజుకు వంట గ్యాస్, పెట్రోలు, డీజీలు, నిత్యావసర వస్తువుల, ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, కొనుగోలు శక్తి పడిపోయి పేద ప్రజల జీవన ప్రమాణాలు తగ్గిపోతున్నాయని అన్నారు. కరోనా దెబ్బతో ఉపాధి అవకాశాలు కోల్పోయి పనుల కోసం వలసలు పోవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. భద్రాచలం పట్టణంలో పేదలు నివాసం ఉంటున్న 17 కాలనీల నుండి వందలాదిమంది వ్యవసాయ కూలి పనుల కోసం దుమ్ముగూడెం, బూర్గంపహాడ్, ఎటపాక మండలాలకు వలస వెళ్లి పనులు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వాలు తీసుకువచ్చిన సంక్షేమ పథకాలు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇండ్ల స్థలాలు, పెన్షన్లు, దళిత బంధు తదితర పథకాలు వ్యవసాయ కార్మికులందరికీ అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యకసా జిల్లా కమిటీ సభ్యులు సౌభాగ్యం, వ్యవసాయ వ్యవసాయ కూలి మేస్త్రిలు నరసమ్మ, సావిత్రి, రమాదేవి, పద్మ, కాకా రాదా, వ్యవసాయ కూలీలు బోరం విజయ, వెంకటేశ్వరమ్మ, కోడి వరలక్ష్మి, వై.ఈశ్వరమ్మ, ఉమామహేశ్వరి, సక్కుబాయి, బంటు పుణ్యవతి, తదితరులు పాల్గొన్నారు.