Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బస్టాండుకు వచ్చి పోతున్న ఆర్టీసీ బస్సులు
- అవాక్కవుతున్న మండల ప్రజలు
నవతెలంగాణ-అశ్వాపురం
మండల ప్రజల ప్రయాణానికి ఆర్టీసీ అధికారులు మంచి రోజులు తీసుకొస్తున్నారని ప్రజలు, ప్రయాణికులు మురిసిపోతున్నారు. ఈ ఆనందం మూన్నాళ్ళ ముచ్చటగానే మిగిలిపోతుందా...లేకపోతే ఆర్టీసీ అధికారులు ప్రజల మనోభావాలకు అనుగుణంగా బస్టాండ్‌కు బస్సులను అనునిత్యం తీసుకువెళ్తారా అంటే ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లే మార్గం మధ్యలో గల టీఎస్ ఆర్టీసీ బస్టాండ్‌కి సోమవారం నుండి మణుగూరు డిపో బస్సుల రాకపోకలను ఆర్టీసీ అధికారులు సాగిస్తున్నారు. సుమారు మూడు దశాబ్దాల కాలం నుండి మూతపడి ఉన్న ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోకి అకస్మికంగా బస్సులు రాకపోకలు చేపట్టుతుండ డంతో మండల ప్రజలు అవాక్కవుతున్నారు. ఆ శాఖ అధికారులు ఇదంతా చేస్తున్నది ప్రయాణికుల సౌకర్యార్థం కోసమా లేక పైసల కోసమా అన్న సందేహంలో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు.
అసలు కథ ఏమిటంటే :
అశ్వాపురం నడిబొడ్డున ప్రయాణికులకు సౌకర్యార్థంగా ప్రభుత్వం ఆర్టీసీ బస్టాండ్‌ను నిర్మించింది. కొంతకాలం సజావుగానే ఈ బస్టాండ్‌లోకి బస్సులు వచ్చినప్పటికీ కాలక్రమేనా ప్రైవేటు రవాణా సౌకర్యాలు మెరుగు పడటంతో పోటీని తట్టుకోలేక ఆర్టీసీ బస్సులు బస్టాండ్ ఆవరణలోకి రాకుండానే ప్రధాన రహదారి నుండే వెళ్తున్నాయి. దీనివలన బస్టాండు పూర్తిగా నిరుపయోగంగా మారింది. వృధాగా ఉన్న టీఎస్ఆర్టీసీ బస్టాండ్ ఆవరణ చెట్లు చామలతో నిండుకొని అడవిని తలపిస్తూ ఉండేది. దీన్ని గమనించిన నాటి ఉమ్మడి ఖమ్మం కలెక్టర్ ఉషారాణి స్థానిక రెవెన్యూ, మండల పరిషత్, గ్రామపంచాయతీ అధికారులతో బస్టాండ్ ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించింది. దీంతో అప్పటి అధికారులతో పాటు గ్రామపంచాయతీ సర్పంచ్ ముళ్ళ చెట్లను తొలగించి బస్టాండ్ ఆవరణను శుభ్రపరిచారు. సంత నిర్వహణకు సరైన స్థలం లేకపోవడంతో స్థానిక పంచాయతీ అధికారులు జిల్లా కలెక్టర్‌కు సంతను నిర్వహించేందుకు అనుమ తించాలని కోరడంతో 2009వ సంవత్సరంలో సంత నిర్వహణకు తాత్కాలిక అనుమతులు ఇచ్చారు. అప్పటినుండి గత రెండు దశాబ్దాలుగా గ్రామపంచాయతీ వారు వారాంతపు సంతను నిర్వహిస్తు కొంత ఆదాయాన్ని సమకూర్చు కుంటున్నారు. ఈ విషయాన్ని గమనించిన ఆర్టీసీ అధికారులు తమ స్థలంలో సంతను నిర్వహిస్తూ గ్రామపంచాయతీ వారు ఆదాయాన్ని సమకూర్చుకుంటుంటే తమకేంటి లాభమని ఆలోచనలో పడ్డ వారు పంచాయతీ అధికారులకు అనేక మార్లు నోటీసులు పంపించారు. ఇరువురి మధ్య సంకేత కుదరకపోవడంతో సోమవారం సంత రోజున బస్టాండ్‌కు బస్సులను పంపితే సంత నిర్వహణ నిలిచిపోతుందన్న ఆలోచనతోనే బస్సులను పంపారనే వాదనలు వినిపిస్తున్నాయి. సంత వేలంతో వచ్చే ఆదాయంలో తమకు రావాల్సిన లీజు ఇస్తేనే సంత నిర్వహించుకునేందుకు అనుమతులు ఇస్తామని ఆర్టీసీ వారు అంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ బస్టాండ్ ఆవరణలో సంత నిర్వహణ కోసం ప్రస్తుత సర్పంచ్ బానోతు శారద, కార్యదర్శి కృష్ణ చైతన్య శ్రమిస్తూ ఆవరణాన్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుతూ ఆర్టీసీ స్థలాన్ని కాపాడుతూ వస్తున్నారు.