Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
నవతెలంగాణ-పాల్వంచ
అక్రమంగా తరలిస్తున్న 33 లక్షల విలువైన గంజాయిని పాల్వంచ రూరల్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. పాల్వంచ రూరల్ ఎస్సై శ్రీనివాస్ కథనం ప్రకారం... నమ్మదగిన సమాచారం మేరకు పాల్వంచ మండల పరిధిలోని సోములగూడెం క్రాస్ రోడ్ లో కాపు కాసి గంజాయి తరలిస్తున్న వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. వాహనంలో ఉన్న ఐదుగురు స్మగ్లర్లలో ఇద్దరు పరారయ్యారు. వాహనాన్ని తనిఖీ చేయగా అందులో 85 ప్యాకెట్ల ఎండు గంజాయి 168 కేజీలు బయటపడింది. వాహనాన్ని, గంజాయిని, నిందితులను పోలీస్ స్టేషన్ కు తరలించి విచారించగా ముగ్గురు నేరస్తులు గంజాయిని మోతుగూడెంలో కొనుగోలు చేసి వైరా తరలిస్తున్నట్లుగా ఒప్పుకున్నారు. ఖమ్మం వికలాంగుల కాలనీకి చెందిన తెల్లబోయిన ఉమేష్ (20), రెబ్బవరంకు చెందిన షేక్ అస్లాం, మరో మైనర్, ముగ్గురు కలిసి గంజాయి స్మగ్లింగ్ తో వచ్చే కమీషన్ కోసం కక్కుర్తి పడి గంజాయి సరఫరా అలవాటు పడ్డారు. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో పరిచయమైన హరి, సందీప్ లను వెంటబెట్టుకుని మోతుగూడెం చేరుకున్నారు. అక్కడ ఎండు గంజాయి ప్యాకెట్లను కొనుగోలు చేసి డాట్సన్ వాహనంలో వైరా తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 33 లక్షలు ఉంటుంది. నేరం ఒప్పుకున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు మైనర్‌ను ఖమ్మంలోని జువైవల్ హౌమ్ కు తరలించి, మిగిలిన ఇద్దరిని కోర్టులో హాజరు పరిచారు. పరారీలో ఉన్న నిందితులు హరి, సందీప్ ల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడిలో పాల్వంచ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు, రూరల్ ఎస్సై శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.