Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళితబంధులో అధికారులు అప్రమత్తంగా ఉండాలి
- దళిత బంధు యంత్రాల వినియోగంపై కలెక్టర్ ఆగ్రహం
నవతెలంగాణ-చింతకాని
దళిత బంధు యూనిట్లు సక్రమంగా వినియోగించుకోకపోతే వేరే వ్యక్తులకు ఆ యూనిట్లను కేటాయిస్తామని జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ హెచ్చరించారు. మండల పరిధిలోని మత్కేపల్లి, తిరుమలాపురం, తిమ్మినేనిపాలెం గ్రామాల్లో పలు దళిత బంధు యూనిట్లను మంగళవారం ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ప్రభుత్వం అందజేసిన జెసిబి, హార్వెస్టర్, సెంట్రింగ్ సామాగ్రి లబ్ధిదారులు సక్రమంగా వినియోగించుకోకపోవడంపై సంబంధిత అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆంధ్ర, తమిళనాడులో హార్వెస్టర్ల అవసరం ఉందని లబ్ధిదారులు హార్వెస్టర్లను అక్కడికి తీసుకువెళ్లి ఉపాధి పొందాలన్నారు. వారం రోజుల వయసు ఉన్న చిన్న గొర్రె పిల్లలను కూడా రూ. 10వేలు చెల్లించాల్సి వచ్చిందని పలువురు లబ్ధిదారులు కలెక్టర్ దృష్టికి తీసుకురావడంతో దీనిపై విచారణ జరపాలని అదనపు కలెక్టర్ స్నేహలతకు సూచించారు దళిత బంధు కోసం చింతకాని మండలానికి ప్రత్యేక పశు వైద్యుడిని నియమించాలని చెప్పినా నేటి వరకు ఎందుకు నియమించలేదని పశుసంవర్ధక శాఖ జెడిఎ వేణు మనోహర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మత్కేపల్లి, తిమ్మినేనిపాలెం గ్రామాల్లోని డ్రోన్ లబ్ధిదారుల వినియోగంపై సంతృప్తి వ్యక్తం చేశారు. తిమ్మినేనిపాలెం గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి కలెక్టర్ అదనపు కలెక్టర్లు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో నూతనంగా మంజూరైన కారు, డీసీఎంలను కలెక్టర్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ పూర్ణయ్య, ఆయా గ్రామ సర్పంచులు కొండలరావు, బండి రమాదేవి, దమ్మాలపాటి శ్రీదేవి, తహసిల్దార్ మంగీలాల్, ఎంపీడీవో శ్రీనివాసరావు, ఎంపీఓ మల్లెల రవీంద్ర ప్రసాద్, జిల్లా అధికారులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.