Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారసత్వంగా వస్తున్న ఇళ్ల స్థలాలను వదులుకోము
- గువ్వలగూడెం గ్రామస్తుల డిమాండ్
నవతెలంగాణ- నేలకొండపల్లి
మండలంలోని గువ్వలగూడెం గ్రామంలోని పాతగూడెంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు ఆలోచనను తక్షణమే విరమించుకోవాలని ఆ గ్రామ మాదిగ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు డిమాండ్ చేశారు. మంగళవారం పాతగూడెంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటును నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ తహసిల్దార్ ధార ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాతగూడెంలోని ఇళ్ల స్థలాలు తమ తాతల కాలం నుండి వారసత్వంగా వస్తున్నాయన్నారు. తమకు స్థిర చర ఆస్తులుగా ఉన్న ఆయా స్థలాలు తప్ప ఎటువంటి వ్యవసాయ భూములు లేవన్నారు. పాతగూడెం నుండి కొత్త కాలనీకి వచ్చి 33 ఏళ్లు దాటిపోయిందన్నారు. అయినా నాటినుండి నేటి వరకు కొత్త ఇల్లు మంజూరు కాకపోవడంతో ఒకే ఇంటిలో పెరిగిన పిల్లలతో రెండు మూడు కుటుంబాలు కలిసి జీవనం సాగిస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఈ పరిస్థితుల్లో తమకు ఒకే ఒక్క ఆధారంగా ఉన్న పాతగూడెం స్థలాలలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయాలని అధికారులు ఆలోచించడం సరైనది కాదన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు మాజీ సర్పంచ్ కొలికపొంగు నరసయ్య, పెద్ద మాదిగ వంగూరి పెద్దబంగారు, ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు వంగూరి ఆనందరావు మాదిగ, బొల్లికొండ వెంకట్ నారాయణ, కొలికపొంగు ఏసోబు, వీరబాబు, కొండ్రు చుక్కయ్య తదితరులు పాల్గొన్నారు.