Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లంకభూములను ముంచిన బీటీపీఎస్ యాష్
నవతెలంగాణ-మణుగూరు
కాలం చెల్లిన సబ్ క్రిటికల్ విధానం వలన కాలుష్యం విపరీతంగా పెరిగింది. దమ్మక్కపేట వద్ద నిర్మించిన యాష్ పాండ్ నిండి గోదావరిలోకి ప్రవహిస్తుంది. గోదావరి జలాలు విషపూరితమౌతున్నాయి. పక్కనే ఉన్న సింగరేణి ఇంటెక్వెల్, మణుగూరుకు మంచినీరు అందించే అనేక మంచినీటి పథకాలున్నాయి. బిటిపిఎస్ బూడిద వలన తాగే నీరు తీవ్రంగా కలుషితమవడం కారణంగా ప్రజలకే కాకుండా జీవరాశులకు కూడా ప్రమాదం పొంచి ఉంది. ఈ కలుషితమైన నీరు తాగడం వలన ప్రజలు అనారోగ్యాల పాలు అవుతున్నారు. సింగరేణి యాజమాన్యం, బిటిపిఎస్ అధికారుల సమన్వయంతో గోదావరి నీరు కలుషితం కాకుండా ప్రజల ఆరోగ్యాలు కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ విడుదల చేసే యాష్ (బూడిద) లంకభూములను ముంచేసింది. భూమిపై ఆధారపడిన గిరిజన రైతులు జీవనోపాధిని కోల్పోయారు. సాంబాయిగూడెం, చిక్కుడుగుంట, దమ్మక్కపేట గ్రామాలకు చెందిన సుమారు 40 మంది రైతులకు చెందిన 40 ఎకరాల భూమి బూడిదతో నిండిపోయింది. ఈ భూములలో పోగాకు, మిరప, పుచ్చకాయలు తదితర పంటలు పండిస్తున్నటువంటి రైతులు గత రెండు సంవత్సరాల నుండి రైతులు బూడిద కారణంగా ఎలాంటి పంటలు పండించలేకపోతున్నారు. భూమిపై ఆధారపడిన కుటుంబాలు జీవనోపాధి లేక దూరప్రాంతాలకు వ్యవసాయ కూలీలుగా వలస వెళ్తున్నారు.
నష్టపరిహారం చెల్లించాలి:రైతు చిడెం బాబురావు
భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంలో భూములు కోల్పోయిన వారికి ఉద్యోగాలు, నష్టపరిహారం ఏ విధంగా చెల్లించారో, లంకభూములను కోల్పోయిన వారికి కూడా నష్ట పరిహారం చెల్లించాలి. పవర్ ప్లాంట్ నిర్మాణానికి ముందు గ్రామసభలు నిర్వహించి అన్ని విధాలుగా ఆదుకుంటామన్నా ప్రభుత్వ అధికారులు లంక భూములకు కూడా నష్టపరిహారం చెల్లించాలన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే భద్రాద్రి పవర్ ప్లాంట్ ముట్టడిస్తాం.