Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ హయాంలోనే కార్మిక హక్కులకు తూట్లు
- సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య
నవతెలంగాణ-భద్రాచలం
కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమిద్ధామని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య అన్నారు. నవంబర్ 16, 17వ తేదీలలో జరిగే సీఐటీయూ జిల్లా మహాసభల జయప్రదం కోసం మంగళవారం సీఐటీయూ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పట్టణ కన్వీనర్ వైవి రామారావు అధ్యక్షతన సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్ ముఖ్య వక్తగా ఎస్.వీరయ్య పాల్గొని మాట్లాడారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక హక్కులు కాలరాయపడుతున్నాయని అన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాలను రద్దు చేస్తూ నాలుగు లేబర్ కోడ్లుగా విభజించడం చూస్తే కార్మికుల పట్ల ఈ కేంద్ర ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందని అన్నారు. సమ్మె చేసే హక్కు, వేతనాల కోసం పోరాడే హక్కు, సంఘాలు ఏర్పాటు చేసుకునే హక్కు లేకుండా చేయడం కేంద్ర ప్రభుత్వ ధ్యేయంగా మారిందన్నారు. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మికులందరూ పోరాటాలకు సిద్ధం కావాలని ఈ పోరాటాలకు సీఐటీయూ నాయకత్వం వహిస్తూ ఎప్పుడు కార్మికులకు అండగా ఉంటుందని ఆయన అన్నారు. కనీస వేతన చట్టం రూ.26 వేలు అమలు చేయకపోగా, ఈరోజు ఉన్న ఉద్యోగాలు లేకుండా చేయడం, పని భద్రత కల్పించకపోవడం, మొత్తం కంపెనీలన్నీ బడా కార్పొరేట్లకు తక్కువ ధరకు దోచి పెడుతూ ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకుంటూ అంతా ప్రయివేటు పరం చేస్తూ కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా గాలిలో దీపంలా వారి బతుకులు మారాయన్నారు. ఈ పరిస్థితి రావడానికి.. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలే కారణమని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులపై దృష్టి పెట్టాలనీ, కార్మిక చట్టాలు పకడ్బందీగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏజే రమేష్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అసంఘటితరంగా కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని, కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలు మరిచి ముందుకు సాగుతుందని, పనులు లేక ఉండడానికి ఇల్లు లేక అద్దెలు కట్టలేక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇల్లు లేని ప్రతి కార్మికుడికి డబల్ బెడ్ రూమ్ మంజూరు చేయాలని, కనీస వేతనం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు నవంబరు 16, 17 జరిగే మహాసభల్లో 28 రకాల అంశాలపై సీఐటీయూ చర్చిస్తుందని, పరిష్కారం కోసం రాబోయే కాలంలో పోరాటాలకు సమర్థమవుతుందని కావున భద్రాచలం పట్టణంలో జరిగే ఈ మహాసభలు జయప్రదం కోసం అందరూ కృషి చేయాలని కోరారు. మొదటి రోజు 16వ తారీఖున జరిగే భారీ ప్రదర్శన బహిరంగ సభను కార్మికులందరూ జయప్రదం చేయాలని ఆయన కోరారు. శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్ జి.పద్మ మాట్లాడుతూ స్కీం వర్కర్లను తీసివేయడం కోసం కేంద్రం చూస్తుందని అక్షయపాత్ర అలాంటి ప్రయివేటు వారిని ప్రోత్సహిస్తూ స్కీములు నీరు గారుతో తమ బాధ్యతల నుంచి తప్పుకోవడం కోసం కేంద్ర ప్రభు త్వం చూస్తుందని దీనికి వ్యతిరేకంగా అందరూ కలిసికట్టుగా పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ సెమినార్లో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్య దర్శి మచ్చా వెంకటేశ్వర్లు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కే.బ్రహ్మచారి, పట్టణ నాయకులు బండారు శరత్ బాబు, మర్లపాటి రేణుక, నకరికంటి నాగరాజు, జి.లక్ష్మీకాంత్, మాధవి, చంద్ర లీల, రమ, సిహెచ్ రమేష్, జాకీర్ వేణు, అప్పారి రాము మధు రమణయ్య, సాయి, అర్జున్, మాధవరావు, ఎంవిఎస్ఎస్ నారాయణ, ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.