Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ శాఖ జిల్లా అధికారి అభిమన్యు
నవతెలంగాణ-అశ్వారావుపేట
ఆయిల్ ఫాం సాగు విస్తరణకు ఆయిల్ ఫెడ్, వ్యవసాయ, ఉద్యాన శాఖలతో సమన్వయంతో పనిచేస్తున్నామని వ్యవసాయ శాఖ, ఉద్యాన, పట్ట పరిశ్రమ శాఖల జిల్లా అధికారుల కె.అభిమన్యు, జినుగు మరియన్నలు స్పష్టం చేశారు. ఈ ఏడాది నిర్దేశించిన సాగు విస్తీర్ణం పూర్తి చేయాలని లక్ష్యంతో ప్రణాళిక అమలు చేస్తున్నామని తెలిపారు. మండలంలోని నారంవారిగూడెం, అశ్వారావుపేట ఆయిల్ ఫాం నర్సరీలను బుధవారం వారు సందర్శించారు. నర్సరీల్లో మొక్కల పెంపకం, నాసిరకం మొక్కల గుర్తింపు పై నియోజవర్గ మండలాల ఏ.ఈ.వో లకు అవగాహన కల్పించారు. అనంతరం ఆయిల్ ఫెడ్ డివిజనల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ ఏడాది జిల్లాలో ఆయిల్ ఫాం సాగు విస్తరణ 14,182 ఎకరాలకు లక్ష్యాన్ని నిర్థేశించటం జరిగిందని, ఇప్పటి వరకు 5,887 ఎకరాలకు మొక్కలు సరఫరా పూర్తి కాగా ఇంకా 8,475 ఎకరాలు మిగిలి ఉందని వివరించారు. సాగు విస్తరణలో తీవ్ర జాప్యం జరగటంతో వ్యవసాయ శాఖ ఏఈవోలను సమన్వయం చేసుకుని లక్ష్యాన్ని పూర్తి చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేశామని చెప్పారు. ప్రతి ఏటా ఆయిల్ ఫాం సాగు చేసే రైతులకు ప్రభుత్వం రాయితీలు అందిస్తుందని, ఏడాదికి ఎకరాకు అంతర పంటతో కలిసి రూ.4,200 చొప్పున నాలుగేళ్లకు రూ.18,800లు రాయితీ పథకం కింద నగదును నేరుగా రైతు ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుందని వివరించారు. ఆయిల్ ఫాం రైతులకు పంట అమ్ము కోవటంలో ఆయిల్‌ఫెడ్ నేరుగా సేకరించి రవాణా చార్జీలతో పాటు ప్రకటించిన గిట్టుబాటు ధరను బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుందని తెలిపారు. అనంతరం నర్సరీల్లో గుర్తించిన రోగ పీడిత(కల్లింగ్) మొక్కలను కాల్చివేశారు. పాత పద్ధతిలోనే దరఖాస్తులు స్వీకరించి మొక్కలు సరఫరా చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ ఏడీఏ లాల్ చంద్, అశ్వారావుపేట ఏడీ.ఏ అఫ్జల్ బేగం, టెక్నికల్ ఎవోలు సాయి నారాయణ, దీపక్, ఆయిల్‌ఫెడ్ ఎకౌంటెంట్ రాధాక్రిష్ణ, క్షేత్ర సిబ్బంది నియోజకవర్గ మండలాల ఏ.వోలు, ఏఈవోలు పాల్గొన్నారు.