Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్వరలో టెండర్లు,
- డిసెంబర్లో పనులు ప్రారంభం
- ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు వెల్లడి
- ముఖ్యమంత్రి కేసిఆర్‌కు కృతజ్ఞతలు
నవతెలంగాణ-పాల్వంచ
మున్సిపాలిటీ పరిధిలోని శ్రీనివాసగిరి గుట్ట మీద వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం 11కోట్ల 25లక్షల రూపాయలను మంజూరు చేసినట్లు కొత్తగూడెం నియోజకవర్గ శాసన సభ్యులు వనమా వెంకటేశ్వరరావు వెల్లడించారు. బుధవారం ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీనివాసగిరి వెంకటేశ్వరస్వామి చరిత్రను ఆలయ ప్రాముఖ్యతను అక్కడ భక్తులు పడుతున్న ఇబ్బందులను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌కు విన్నవించానని చెప్పారు. పలుమార్లు అధికారులతో సమావేశాలు నిర్వహించి ఆర్ ఆండ్ డి అధికారులతో ప్రతిపాదనలు తయారు చేసి ముఖ్యమంత్రికి అందజేసినట్లు చెప్పారు. ఫారెస్ట్ అధికారులు ఈ గుడి రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉన్నందున గుట్టపైకి రోడ్డు వేయడానికి అడ్డుపడడంతో ఫారెస్ట్ మినిష్టర్ ఇంద్రకరణ్‌రెడ్డి, పిసిసిఎఫ్ శోభ పలుమార్లు కలిసి మాట్లాడడం జరిగిందని అయినప్పటికి ఫారెస్ట్ అధికారులు ససెమిరా అనడంతో చివరికి దీనికి సమానమైన 1.85 హెక్టార్ల స్థలాన్ని ఫారెస్ట్ అధికారులకు ఇస్తామని ఒప్పుకోవడంతో అంగీకరించారని చెప్పారు. తిరుపతిలో లాగా గుట్టపైకి సిమెంట్ రోడ్డు, రిటర్నింగ్ వాల్, లైటింగ్ వేయాలని ఆర్‌అండ్‌డి అధికారులతో 11.25 లక్షలతో ప్రతిపాదనలు ఉన్నతాధికారులకు పంపడంతో ఈ దేవాలయం అభివృద్ధి చెందితే వేలసంఖ్యలో భక్తులు దర్శించుకునే వీలుందని ముఖ్యమంత్రికి వివరించామని తెలిపారు. దీంతో ఈ నిధులను మంజూరు చేస్తూ అధికారిక ఉత్తర్వులు వచ్చాయని తెలిపారు. వచ్చే నెలలో టెండరు పిలిచి డిసెంబర్ నెలాఖరులో శంకుస్థాపన చేయనున్నామని, జిల్లా కలెక్టరేట్ ప్రారంభానికి సిఎం రానున్నారని తెలిపారు. గనుక అదేరోజు ఆలయ అభివృద్ధికి శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. అలాగే దమ్మపేట సెంటర్ నుండి శ్రీనివాసకాలనీ వరకు రోడ్డు బాగోలేనందున రెండు దేవాలయాలు అభివృద్ధి చెందితే భక్తులు ఎక్కువగా దర్శించుకునే అవకాశం ఉండడంతో కోటి 50 లక్షలతో దమ్మపేట నుండి శ్రీనివాసకాలనీ వరకు రోడ్డు మంజూరు అయిందని చెప్పారు. ఈ ఆలయ అభివృద్ధికి తను చేసిన కృషి ఫలించడం పట్ల ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపినట్లు చెప్పారు.