Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్టీసీ కార్మికుల పోరాటాలకు సిఐటియు అండ
- సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణం వెంకటేశ్వరరావు
నవతెలంగాణ-ఖమ్మం
ఆర్టీసీ కార్మికుల చారిత్రాత్మక 55 రోజుల సమ్మె తర్వాత, ప్రభుత్వ వైఖరి మూలంగా వేతన సవరణలకు దూరమై, పెంచిన పని భారాలతో సమస్యలు ఎదుర్కొంటున్న ఆర్టీసీ కార్మికులు గత సంవత్సరంన్నర కాలంగా రాష్ట్ర స్థాయిలో జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పాటై నిర్వహించిన ఆందోళనలో ఐక్యంగా పాల్గొన్న ఆర్టీసీ కార్మికులందరికీ అభినందనలు అని భారత కార్మిక సంఘాల కేంద్రం (సిఐటియు) జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణం వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం ఖమ్మంలోని సిహెచ్.వి.రామయ్య స్మారక భవనంలో సిరిపురపు సీతారామయ్య అధ్యక్షతన స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (సిఐటియు) ఖమ్మం డిపో కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అయన మాట్లాడుతూ కేంద్రంలోని పాలక ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలన్నీంటిని ప్రైవేటుపరం చేస్తూ, కార్మిక వర్గానికి అండగా ఉన్న చట్టాలను మారుస్తూ, మతోన్మాదంతో ముందుకు వస్తున్న నేపథ్యంలో మతోన్మాద శక్తుల్ని కట్టడి చేయడం కోసం, లౌకిక వాద పరిరక్షణ, ప్రజా కోణంలో మునుగోడు ఉప ఎన్నికల నేపధ్యంలో వామపక్ష పార్టీలు తెలంగాణలో పాలక టిఆర్ఎస్ పార్టీకి మద్దతు పలికాయని తెలిపారు. వామపక్షాల చొరవ ఆర్టీసీ కార్మిక సంఘాల రాష్ట్ర జేఏసీ నిర్వహించిన ఆందోళనల మూలంగా ప్రభుత్వ వైఖరిలో మార్పు వచ్చిందని, ఫలితంగానే ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందని తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాడి మూడు డిఏలు, పండుగ అడ్వాన్సు, సకలజనుల సమ్మె కాలానికి వేతనం పొందుతున్న ఆర్టీసీ ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. ఆర్టీసీ కార్మికులు ఎప్పుడూ ఒంటరి వారు కాదని, ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో వామపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు ఆర్టీసీ కార్మికుల పోరాటానికి అండగా నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. స్టాప్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఖమ్మం రీజియన్ కార్యదర్శి గడ్డం లింగమూర్తి మాట్లాడుతూ ఆర్టీసీ ఖమ్మం రీజియన్‌లో కార్మిక సమస్యల పరిష్కారం పట్ల స్పష్టమైన అవగాహన కలిగి ఐక్య పోరాటాల ద్వారా అనేక కార్మిక సమస్యలు పరిష్కరించిన చరిత్ర ఖమ్మం రీజియన్‌లో స్టాప్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్‌కు ఉందని తెలిపారు. గత మూడు సంవత్సరాల కాలంలో కార్మిక సంఘాల కార్యకలాపాలు లేకుండా ఏర్పాటు చేసిన సంక్షేమ మండలి సభ్యులు కార్మికుల సమస్యలు ఏమాత్రం పట్టించుకోని కారణంగా కార్మికులు అనేక రకమైన సమస్యలతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. స్టాప్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ డిపో స్థాయిలో కార్మిక సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఈనెలలోనే స్టాప్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఖమ్మం రీజియన్ మహాసభ జరగాల్సి ఉన్నదని, అందువలన ఖమ్మం డిపో నిర్వహణ ఏర్పాట్లు చేయాలని సూచించారు. కార్యక్రమంలో రీజనల్ అధ్యక్షులు ఎర్రంశెట్టి వెంకటేశ్వర్లు, ప్రచార కార్యదర్శి తోకల బాబు, కోశాధికారి పర్వీణ పాల్గొని ప్రసంగించిన ఈ సమావేశంలో డిపో కార్యదర్శి గుండు మాధవరావు, డిపో కమిటీ నాయకులు గుగ్గిళ్ల రోశయ్య, పగిళ్లపల్లి నరసింహారావు, బందెల వీరభద్రం, షేక్ నసీరుద్దీన్, పద్మ, సరిత, సునీత, వై.అశోక్, రామకృష్ణ నాయుడు, బుగ్గవీటి లింగమూర్తి, రంగా రామారావు తదితరులు పాల్గొన్నారు.