Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీరోలులో రియల్ బ్రోకర్ల దుశ్చర్య
- రైతుల ఫిర్యాదు.. చర్యలకు నీటిపారుదల శాఖ ఆదేశం
నవతెలంగాణ - తిరుమలాయపాలెం
బీరోలులో రియల్ బ్రోకర్లు తెగించారు. కల్పకుంట నుంచి పాయచెరువు వెళ్లే వరవకాల్వ కట్టను మంగళవారం రాత్రికి రాత్రే ధ్వంసం చేశారు. ఆక్రమణల కారణంగా ఇప్పటికే కుచించుకుపోయిన కట్టను ఉన్న కొంచెం ధ్వంసం చేయడంతో కొద్దిపాటి వర్షానికి నీరు కాల్వ నుంచి ఉప్పొంగే ప్రమాదం ఉంది. తద్వారా కాల్వ కింద ఉన్న పల్లపు ప్రాంత పంట భూములు సుమారు 70 ఎకరాల వరకు దెబ్బతింటాయని సంబంధిత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం పనులు ముగించుకొని ఇళ్లకు వెళ్లేటప్పుడు ఉన్న కట్టను తెల్లారే సరికి ధ్వంసం చేయడంపై నీటిపారుదల శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు డీఈ రమేష్‌రెడ్డి వెంటనే స్పందించి తక్షణం ఏఈఈ వి.రామ కృష్ణను ఘటనా స్థలికి పంపారు. రియల్ బ్రోకర్ల దుశ్చర్యను చూసిన ఆయన విషయాన్ని పై అధికారులకు తెలుపుతానని రైతులకు హామీ ఇచ్చారు. కాల్వ కట్టను పునర్న్మించాలని రియల్ బ్రోకర్లకు సూచించారు. లేనిపక్షంలో చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరైనా నీటిపారుదల శాఖ వనరుల ధ్వంసానికి పాల్పడినా...దురాక్రమణకు పూనుకున్నా చర్యలు తప్పవని హెచ్చరించారు.