Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విరాళాలు సేకరణతో సౌకర్యాలు కల్పన
- ప్రయివేట్ పాఠశాలలకు ధీటుగా ఊరు బడి
- గ్రామస్తుల సహకారంతో పాఠశాల అభివృద్ధి
నవతెలంగాణ-అశ్వారావుపేట
కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు మహా పురుషులు అవుతారనే నానుడిని ఈ మహిళా ఉపాధ్యాయులు తిరిగి రాస్తున్నారు. పురుషులే కాదు మహిళలు సైతం ఏదైనా సాధిస్తారు అని నిరూపిస్తున్నారు ఊరు బడి పంతులమ్మలు. మండల పరిధిలోని మద్ది కొండ మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలో 1 నుండి 5 తరగతులలో మొత్తం 38 మంది చదువుతున్నారు. ఈ పాఠశాల ప్రాంగణంలో రెండు భవనాలు ఉండగా ఒక పాత భవనాన్ని పంచాయతీ కార్యాలయానికి కేటాయించారు. ఉన్న ఒక భవనంలో ఒక గది, ఒక వరండాలో ఈ ఐదు తరగతులు బోధన చేస్తున్నారు. ఇక్కడ ఇద్దరూ మహిళా ఉపాధ్యాయులే అయినప్పటికీ పురుష ఉపాధ్యాయులకు ధీటుగా బోధన చేస్తూ పాఠశాలను అభివృద్ధికి కృషి చేస్తున్నారు. అదే గ్రామానికి చెందిన అడ్వకేట్ కఠారి పాండురంగారావు ఆర్ధిక సహాకారంతో సుమారు రూ.75 వేల విలువ గల క్రీడా సామగ్రి, పరికరాలను పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేయించారు. అలాగే పాఠశాలకు ఉపయోగపడే వాటర్ ఫ్యూరీ ఫైర్ ఒకటి సమకూర్చుకుంటున్నారు. విద్యార్ధులకు టీవి పాఠాలు నేర్పడం కోసం అచ్యుతాపురంకు చెందిన ఇనుగంటి హరిబాబు టి.వి అందజేసారు. పాఠశాల ప్రాంగణం పచ్చని చెట్లతో ఆహ్లాదం పంచేలా రూపు దిద్దారు. ఇదే గ్రామానికి చెందిన అశ్వారావుపేట మండల పరిషత్ మాజీ అధ్యక్షులు ఆర్ధిక సహకారంతో పాఠశాల ప్రాంగణంలో సరస్వతి విగ్రహం నెలకొల్పారు. మరికొందరు ఉద్యోగులు మధ్యాహ్నం భోజనం చేరడానికి ప్లేట్లు, పుస్తకాలు అందజేసారు. పాఠశాల అభివృద్ధికి సర్పంచ్ భవాని, ఎంపీటీసీ కాసాని దుర్గ, గ్రామ పెద్దలు సహకారం మరువలేనిదని ప్రధానోపాధ్యాయురాలు మంగమ్మ, ఎస్జీటీ కోకిల నవతెలంగాణతో అన్నారు.