Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లో వోల్టేజ్ ఉన్న ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలి
- సీపీఐ(ఎం) పట్టణ కమిటీ డిమాండ్
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం పట్టణంలో వివిధ కాలనీలో అవసరమైన చోట కరెంటు స్తంభాలు వేయాలని, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి లోవోల్టేజ్ సమస్య పరిష్కరించాలని సీపీఐ(ఎం) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్ వినియోగదారుల సదస్సులో వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి మాట్లాడుతూ భద్రాచలం పట్టణంలో మారుమూల కాలనీలలో కరెంటు స్తంభాలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర సమస్య ఎదుర్కొంటున్నారన్నారు. అనేక ప్రాంతాలలో లో వోల్టేజ్ సమస్య తీవ్రంగా ఉందని, అవసరమైన చోట నూతనంగా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటుచేసి లోవోల్టేజీ సమస్య పరిష్కారం చేయాలని అన్నారు. పట్టణంలో ఐరన్ కరెంటు పోల్స్ తొలగించి సిమెంట్ కరెంటు పోల్స్ ఏర్పాటు చేయాలని అన్నారు. టార్గెట్స్ పేరుతో కరెంటు బిల్లులు వసూలు చేసేటప్పుడు ప్రస్తుత బిల్లు చెల్లింపుకు సమయం ఉన్నా పెండింగ్ బిల్లులు కట్టించుకోకపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ సమస్య పరిష్కరించాలని అన్నారు. వినియోగదారులకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా విద్యుత్తు వాడకం పెరిగింది అనే పేరుతో కేటగిరీపెంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఇది సరైనది కాదని అన్నారు. విద్యుత్ వినియోగదారుల సదస్సులో వచ్చిన సమస్యల్ని అధికారులు చిత్తశుద్ధితో పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు బి.వెంకటరెడ్డి, బండారు శరత్ బాబు తదితరులు పాల్గొన్నారు.