Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ నూతన మండల కమిటీ ఎన్నిక
నవతెలంగాణ-ఆళ్ళపల్లి (గుండాల)
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్కీం వర్కర్లతో వెట్టిచాకిరి చేయిస్తున్నారని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు ఈసం వెంకటమ్మ, ఇల్లందు ప్రాంతీయ కన్వీనర్ అబ్దుల్ నబీ అన్నారు. ఈ మేరకు శుక్రవారం గుండాల మండల కేంద్రములో సీఐటీయూ ద్వితీయ మహాసభలు ఎం.ధనమ్మ, ఎండీ.నజీమల అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వెంకటమ్మ, అబ్దుల్ నబీ హాజరై, మాట్లాడారు. ఒకే డిపార్ట్మెంట్లలో స్కీం వర్కర్లుగా పనిచేస్తున్న అంగన్వాడి, మినీ, డైలీ వేజ్, అవుట్ సోర్సింగ్ కార్మికులకు ఇచ్చే వేతనాలలో చాలా తేడాలు ఉన్నాయని చెప్పారు. కనీస వేతన చట్టం అమలు చేయకుండా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న స్కీం వర్కర్లకు అరకొర వేతనాలు ఇస్తూ, పని భారాన్ని మోపి మానసికంగా, శారీరకంగా అనేక రోగాలు బారిన పడేవిధంగాపై అధికారులు లోను చేస్తున్నారని అన్నారు. 20 ఏళ్లుగా మధ్యాహ్న భోజన కార్మికులు రెక్కలు ముక్కలు చేసుకొని శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతూ పిల్లలకు వండి పెడుతున్నారని, వారికిచ్చే వేతనాలు అరకొరగా ఇస్తున్నారని, నిత్యాసర సరుకుల ధరలు ఆకాశాన్నింటినప్పటికీని బిల్లులు పెంచడం లేదని తెలిపారు. గుడ్డును ప్రభుత్వం సరఫరా చేయడం లేదని అన్నారు. ఆశా వర్కర్లతో అధికారులు చేయాల్సిన సాంకేతిక పనులు కూడా చేయిస్తున్నారని, అంగన్వాడి వర్కర్లను బీఎల్ఓ లంటూ ఆధార్ ఓటరు అనుసంధానం పేరుతో సర్వేలు చేయిస్తూ, వారి అసలుపని పౌష్టికారాన్ని పిల్లలకు, గర్భిణీలకు, బాలింతలకు అందించాల్సిన సేవలకు దూరం చేస్తున్నారని వాపోయారు. సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ సమరశీల పోరాటాలు చేస్తుందని, అందులో భాగంగానే శుక్రవారం నూతనంగా ఎన్నిక అయిన మండల కమిటీ కార్మిక వర్గ సమస్యల పట్ల అకుంఠిత దీక్షతో పనిచేయాలని వారు కోరారు. ఈ మహాసభలో సీఐటీయూ మండల కన్వీనర్‌గా వజ్జ సుశీల, కో కన్వీనర్‌గా సారమ్మలతో పాటు 25 మందితో నూతన కమిటీని ఎన్నుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సన్ప పార్వతి, పూనెం సరోజ, వట్టం పూలమ్మ, తదితరులు పాల్గొన్నారు.