Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేలకొండపల్లి
మండలంలోని చెరువుమాదారం గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఉన్న కల్వర్టు నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని సిపిఐ(ఎం) మండల కార్యదర్శి కె.వి.రామిరెడ్డి డిమాండ్ చేశారు. డిసెంబర్ 5, 6, 7 తేదీలలో ఖమ్మం నగరంలో జరగనున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మూడవ రాష్ట్ర మహాసభల జయప్రదం కోరుతూ గ్రామంలోని దళిత కాలనీలో సీపీఐ(ఎం) గ్రామ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం విస్తత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీకి చెందిన దళితులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను సిపిఎం ప్రతినిధి బృందానికి వివరించారు. కె.వి.రామిరెడ్డి మాట్లాడుతూ దళిత బజారులో కల్వర్టు నిర్మాణం కోసం గుంతలు తీసి రెండు ఏళ్ళు గడుస్తున్నా సంబంధిత అధికారులు, గ్రామ పంచాయతీ పాలకవర్గం నేటి వరకు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కల్వర్టు నిర్మాణం పట్ల గ్రామపంచాయతీ పాలకవర్గ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కల్వర్టు నిర్మాణంలో జాప్యానికి గల కారణాలు ఏంటో తక్షణమే తెలియజేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా పంచాయతీ పాలకవర్గం, అధికారులు స్పందించి కల్వర్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలని లేని ఎడల దళితులను సమీకరించి గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళనకు పూనుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు గుడవర్తి నాగేశ్వరరావు, మండల నాయకులు ఏరదేశి నరసింహారావు, దుగ్గి వెంకటేశ్వర్లు, పాలకుర్తి బోడయ్య, తిరపయ్య, బి రెడ్డి యాదయ్య, ఎస్.కె ఉస్మాన్, ఎస్.కె మజీద్, మహిముద్, కాలనీ దళితులు పాల్గొన్నారు.