Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సభ ప్రారంభించకుండానే వాయిదా
- సభ నుంచి పలాయనం చిత్తగించిన సర్పంచ్
- సభ నుండి సర్పంచ్‌ని లాక్కెళ్ళిన భర్త
- సర్పంచ్ చెబితేనే సభ పెట్టామంటున్న అధికారులు
- సర్పంచ్‌పై గ్రామ ప్రజల ఫిర్యాదు
నవతెలంగాణ-ముదిగొండ
మండలపరిధిలోనే సువర్ణాపురం గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం గ్రామసభ నిర్వహించారు. ఈపంచాయతీలో ఆది నుండి సర్పంచ్, ఉపసర్పంచ్ మధ్య గ్రామంలో ఆధిపత్య పోరు కొనసాగుతున్న విషయం విధితమే. గ్రామసభకు గ్రామంలోని పంచాయతీ పాలకవర్గంతోపాటు, మహిళలు అధికసంఖ్యలో హాజరయ్యారు. గ్రామ సర్పంచ్ కొట్టే అరుణ మాట్లాడుతూ గ్రామసభను వాయిదా వేశామని చెప్పటంతో గ్రామస్తులు పాలకవర్గ సభ్యులు అవాక్కయ్యారు. ఉపసర్పంచ్ చెక్ పవర్ అంశం ఎటూ తేలకుండానే గ్రామసభ వాయిదా పడింది. సువర్ణపురం ఉపసర్పంచ్ తోట ధర్మారావు చెక్కులపై సంతకాలు చేయకుండా గ్రామ అభివృద్ధికి అడ్డుపడుతున్నాడని జాయింట్ చెక్ పవర్‌ని ఉపసర్పంచ్ ధర్మారావు నుంచి వేరొకరికి బదిలీ చేయాలని సర్పంచ్ కొట్టే అపర్ణ మండల పంచాయతీ అధికారి పి సూర్యనారాయణకు ఇటీవల కాలంలో ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై గ్రామసభ నిర్వహించాలని గ్రామ కార్యదర్శి బుర్రా హరీష్‌కు ఎంపీఓ ఆదేశించారు. దీంతో శుక్రవారం గ్రామసభ నిర్వహించారు. దీంతో శుక్రవారం ఉదయం నుంచే గ్రామస్తులు భారీగా గ్రామపంచాయతీ కార్యాలయం చేరుకున్నారు. ఉదయం 10:30 నిమిషాలకు సభా ప్రారంభం కాగా పంచాయతీ కార్యదర్శి సభకు అధ్యక్షత వహించమని సర్పంచ్ కొట్టే అపర్ణకు మైకు ఇచ్చారు. ఏమి జరిగిందో ఏమో గాని చెక్ పవర్ మార్పిడి అంశంపై చర్చ జరగకుండానే ఒక మాటతోనే సభను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించి అక్కడ నుంచి సర్పంచ్ పలాయనం చిత్తగించడం ఆశ్చర్యానికి గురి చేసింది. చెక్ పవర్ మార్చాలని ఫిర్యాదు చేసిన సర్పంచే సభను వాయిదా వేయడంతో అక్కడ ఉన్న గ్రామ ప్రజలకు ఏమి అర్థం కాక కాసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈవిషయంపై కార్యదర్శిని వివరణ అడిగితే సర్పంచ్ ఇష్టం మేరకు గ్రామసభను ఏర్పాటు చేయడం జరిగిందని వారి ఇష్టం ప్రకారమే వాయిదా వేయడం జరిగిందని మాకు ఏమీ తెలియదని అనడంతో ప్రజలు వాగ్వాదానికి దిగారు. తాము పనులు మానుకొని ఉదయం నుంచి ఇక్కడ ఉంటే సభను వాయిదా వేస్తున్నామని చెప్పడం ఏంటని, ఇది మమ్మల్ని అవమానపరిచే విధంగా ఉందని గ్రామ ప్రజలు వాపోయారు. కాగా సర్పంచ్ మాట్లాడుతుండగానే ఆమె భర్త వచ్చి సభ నుంచి సర్పంచ్‌ని లాక్కెళ్లడం చర్చనీయాంశమైనది. గ్రామసభ జరిగితే తమ అభిప్రాయాలను, వ్యక్తపరుద్దామని ఉన్న గ్రామ ప్రజలకు వాయిదా వేశారని చెప్పడంతో తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. మీఇష్టం వచ్చినట్టుగా చేస్తారా అని అధికారులను గ్రామస్తులు ప్రశ్నించారు.సర్పంచ్ సభ నుంచి వెళ్లిపోవటంతో గ్రామస్తులు సర్పంచ్ రావాలి అంటూ, సభను నిర్వహించాలని గ్రామస్తులు నినాదాలు చేశారు. సర్పంచ్ కొట్టే అపర్ణ పని విధానంపై, విసుగెత్తిపోయామని, ఈసర్పంచ్ మాకు వద్దు అంటూ గ్రామ ప్రజలు మండల పంచాయతీ రాజ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. కాగా సువర్ణాపురంలో గ్రామ అభివృద్ధి అటుకెక్కింది. సర్పంచ్, ఉప సర్పంచ్ మధ్య ఆధిపత్య, పోరు ముదరటంతో గ్రామ ప్రజలు వారి మధ్య సమస్యలతో కూనరిల్లుతున్నారు. నాలుగేళ్లగా గ్రామపంచాయతీ నిధులు వృథా అవుతున్నాయి.