Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్వరితగతిన డబుల్ ఇళ్ళు
- గురుకుల విద్యార్థినులకు కలెక్టర్ అభినందనలు
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
'మన ఊరు-మన బడి' అభివద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ఆదేశించారు. కలెక్టరేట్ లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో అధికారులతో పనుల పురోగతిపై మంగళవారం కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 426 పాఠశాలల్లో మన ఊరు-మన బడి కార్యక్రమం కింద అభివృద్ధి పనులు చేపట్టినట్లు, 416 పాఠశాలల్లో పనులు గ్రౌండింగ్ అయినట్లు తెలిపారు. ఇందులో 372 పాఠశాలల్లో ఉపాధిహామీ కింద పనులు జరుగుతున్నట్లు తెలిపారు. గుర్తించిన 63 పాఠశాలల్లో పెయింటింగ్ పనులు చేపట్టినట్లు ఆయన అన్నారు. పెయింటింగ్ కు సిద్ధంగా ఉన్న పాఠశాలల్లో పనులు చేపట్టి పూర్తి చేయాలన్నారు. ఇంకా 10 పాఠశాలల్లో పనులు ప్రారంభం కాలేదన్నారు. పూర్తి అయిన పనులకు వెంటనే ఎంబిలు సమర్పించాలన్నారు. నవంబర్ 15 కల్లా పూర్తయిన పనుల బిల్లులు సమర్పించాలన్నారు. పనులు పూర్తయిన పాఠశాలలకు ఈ నెల నుండి డ్యూయల్ డెస్క్లల పంపిణీ ప్రారంభం కానున్నట్లు ఆయన తెలిపారు. 12 పాఠశాలల్లో 27 అదనపు తరగతి గదుల నిర్మాణానికి రివైజ్డ్ ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. గిరిజన సంక్షేమం, రోడ్లు భవనాల ఇంజనీరింగ్ శాఖలు చేపట్టిన పనుల్లో వేగం పెంచాలన్నారు. పనుల పూర్తికి అధికారులు రోజువారీ సమీక్ష చేయాలని, వ్యక్తిగత శ్రద్ధతో త్వరితగతిన పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, జిల్లా విద్యాధికారి ఎస్. యాదయ్య, ఇఇలు నాగశేషు, శ్యామ్ ప్రసాద్, శ్రీనివాసరావు, చంద్రమౌళి, కృష్ణలాల్, మండల విద్యాధికారులు, ప్లానింగ్ కోఆర్డినేటర్ రామకష్ణ, డిఇ లు తదితరులు పాల్గొన్నారు.
గురుకుల విద్యార్థినులకు కలెక్టర్ అభినందనలు
ఈ ఏడాది మెరుగైన ఫలితాలు సాధించిన ఖమ్మంలోని డా బి.ఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులను జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ అభినందించారు. తన చాంబర్లో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ దేశంలోని అత్యున్నత సాంకేతిక విద్య కళాశాలల్లో నిట్, ఐఐటీలో ప్రవేశాలు పొందటం అభినందనీయమని విద్యార్థినులకు సూచించారు. హైదరాబాదులో ఐఐటీ సివిల్ ఇంజనీరింగ్ సీటు సాధించిన బి. హరిణి, పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్లో సీఎస్ఈ సీటు పొందిన బి.ఎ. మానస, నిట్ కాలికట్లో మెకానికల్ సీటు సాధించిన ఎం. ప్రియాంక, పుదుచ్చేరి నిట్లో సివిల్ సీటు పొందిన సి.హెచ్. మౌనిక, దుర్గాపూర్ నిట్లో కెమికల్ ఇంజనీరింగ్ సీటు సాధించిన సి.హెచ్ నివేదిత, కర్నాటక సి.యులో ట్రిపుల్ ఊ సీటు గ్రహీత ఏ. కావేరి, బిలాస్పూర్ సెంట్రల్ యూనివర్సిటీ సివిల్ సీటు పొందిన డి. హిమబిందు, అస్సాం సిల్చర్ లో సివిల్ సీటు సాధించిన ఎస్. గాయత్రి, ఎస్ఎల్ ఐఐటీ, పంజాబ్ లో సీటు పొందిన తేజస్వీ, అరోరా డిజైన్ అకాడమీలో బీటెక్ సీటు సాధించిన ఈ. సౌమ్యను కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో ఆర్.సి.ఓ ప్రత్యూష, డా బి.ఆర్.అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సి.హెచ్. జ్యోతి, అధ్యాపకులు, విద్యార్థినుల తల్లిదండ్రులను జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, గురుకులాల్లో విద్యానభ్యసించే విద్యార్థిని, విద్యార్థులు వీరిని స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కలెక్టర్ సూచించారు.
త్వరితగతిన డబుల్ ఇళ్ళు
జిల్లాలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టరేట్ లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో అధికారులతో డబల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాల పురోగతిపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. నిర్మాణాలు త్వరగా పూర్తి చేసి, లబ్ధిదారులకు అందజేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాకు 14,555 డబుల్ బెడ్ రూంలు మంజూరు కాగా, 8,956 ఇండ్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేశామన్నారు. 7,784 ఇండ్లకు టెండర్లు ఖరారు కాగా, 7,023 ఇళ్ల పనులు ప్రారంభించినట్లు, 4,455 ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసినట్లు వివరించారు. 3,965 ఇండ్లను అందజేసినట్లు, 881 ఇండ్లకు లబ్ధిదారుల ఎంపిక కొనసాగుతున్నట్లు చెప్పారు. 761 ఇండ్ల నిర్మాణాలు ప్రారంభం కాలేదని తెలిపారు. బ్లాకుల వారీగా నిర్మాణాలు, సౌకర్యాల కల్పనపై దష్టి పెట్టాలన్నారు. నిర్మాణాలు పూర్తయిన చోట విద్యుద్దీకరణ, శానిటరీ, సంప్, డ్రెయిన్ ల నిర్మాణం, సీవరేజ్, సెప్టిక్ ట్యాంకుల నిర్మాణాలు, అంతర్గత రహదారులు, అప్రోచ్ రోడ్లపై దష్టి పెట్టి వెంటనే పూర్తి చేయాలన్నారు. వివిధ శాఖల సమన్వయంతో పనుల పూర్తికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. ఈ సమావేశంలో డిఆర్వో శిరీష, ఆర్ అండ్ బి, పీఆర్, టీఎస్ ఇడబ్ల్యూఐడిసి, మిషన్ భగీరథ, ట్రైబల్ శాఖల ఇఇ లు శ్యామ్ ప్రసాద్, శ్రీనివాసరావు, చంద్రమౌళి, నాగశేషు, పుష్పలత, తానాజీ, వివిధ శాఖల డిఇ లు, ఏ ఇ లు తదితరులు పాల్గొన్నారు.