Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దమ్మపేట
పశుసంవర్థక శాఖ జిల్లా అధికారి డాక్టర్ యం.వెంకటేశ్వర్లు శనివారం దమ్మపేట పశువైద్యశాలను సందర్శించారు. ఈ సందర్భంగా లంపిస్కిన్ వ్యాధి నివారణా టీకాల పురోగతిని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా దమ్మపేట పశువైద్యాధికారి డాక్టర్ మన్యం రమేష్‌బాబుతో కలసి ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఈ లంపిస్కిన్ వ్యాధి సూక్ష్మాతి సూక్ష్మక్రిములు వైరస్ వలన సోకుతుందని ఈ వ్యాధి గో జాతిలో ఎక్కువగా సోకుతుందని, గేదె జాతికి కూడా వచ్చే అవకాశం ఉందని తెలిపారు. మిగతా జీవాలకు మనుష్యులకు ఈ వ్యాధి సోకదని తెలపారు. రెండు మూడు రోజులుగా ఈ వ్యాధి సోకినపుడు పశువులకు జ్వరం వస్తుందని శరీరంపై రెండు నుండి 5 సెంటీమీటర్ల వరకు గుండ్రంగా కురుపులు, దద్దుర్లు వస్తాయని ఆకలి మందగిస్తుందని, పాలవుత్పత్తిలో తగ్గుదల కనపడుతుందని, సూడి పశువుల్లో అబార్షన్, మగపశువుల్లో వ్యంధత్వం సంభవించవచ్చని తెలిపారు. వ్యాధి సోకిన పశువులను వెంటనే మంద నుండి వేరు చేసి చికిత్స అందించాలని 15 రోజుల తరువాతనే మందలో కలపాలని వ్యాధి సోకకుండా పశువులకు గోట్‌పాక్స్ టీకాలు వేయించాలని ఎప్పటికప్పుడు పశువుల కొట్టాలను పరిశుభ్రంగా ఉంచి కీటకాలు పెరగకుండా పొగవేయాలని సూచించారు. మరిన్ని వివరాలకు తమతమ గ్రామాలలో ఉన్న పశువైద్య సిబ్బందిని రైతులు ఎప్పటికప్పుడు కలసి తగు సూచనలు పొందాల్సిందిగా తెలిపారు. ఈ కార్యక్రమంలో దమ్మపేట పశువైద్యసిబ్బంది పలువురు రైతులు పాల్గొన్నారు.