Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చర్ల
భారత దేశ భవిష్యత్తు ప్రతి ఒక్క యువకుడి చేతిలో ఉందని ఎస్పీ వినీత్ జి అన్నారు. మండల కేంద్రంలో త్వరలో క్రీడా మైదానం ఏర్పాటు చేయనున్నట్లు అలాగే కానిస్టేబుల్ ఎస్సై అభ్యర్థులకు ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. శనివారం మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో సీఐ బి.అశోక్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. యువత చెడు మార్గాల వైపు పయనించకుండా తమ శక్తి సామర్థ్యాల మేరకు వివిధ రంగాలలో నైపుణ్యాన్ని ప్రదర్శించి దేశ భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు, పోలీసులు స్నేహపూర్వక సత్సంబంధాలు కలిగి ఉండాలని కోరారు. త్వరలోనే మండల కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అలాగే కానిస్టేబుల్స్ ఎస్సై అభ్యర్థులకు త్వరలోనే పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్ అందించనున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థుల శారీరక సామర్థ్యం కోసం దుమ్మగూడెం, చర్ల మండలాలకు చెందిన వారికి ఉచితంగా షూస్, రన్నింగ్ ట్రాక్స్ అందించనున్నట్లు వెల్లడించారు. జిల్లా ఓఎస్డి టి.సాయి మనోహర్ మాట్లాడుతూ మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన చర్ల మండలంలో యువత అన్ని రంగాలలో ముందుండి మండలానికి పేరు ప్రఖ్యాతలు తేవాలని ఆయన కోరారు. భద్రాచలం ఏఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ పోలీసులు ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు ఉదాహరణగా నిలవడం ఎంతో అభినందనీయమని అన్నారు. చర్ల సీఐ బి.అశోక్ నేతృత్వంలోని చర్ల పోలీసులు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ జిల్లా పోలీసులకే ఆదర్శంగా నిలవడం పట్ల పోలీసులను అభినందించారు. సీఐ బి.అశోక్ మాట్లాడుతూ యువత క్రీడలలో రాణించి శరీర దారుఢ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 41 వాలీబాల్ టీములకు వాలీబాల్స్, నెట్లు పంపిణీ చేసినట్లు 300 మంది విద్యార్థులకు సోలార్ లైట్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో సిఆర్పిఎఫ్ 141 బెటాలియన్ కమాండెంట్ ప్రశాంత్ డర్, సెకండ్ ఇన్ కమాండెంట్ కమల్ వీర్ యాదవ్, చర్ల ఎస్ఐలు రాజు వర్మ, వెంకటప్పయ్య, చర్ల బి కంపెనీ అసిస్టెంట్ కమాండెంట్ సోమజిత్ భగత్, కమాండెంట్ సంజరు కుమార్, పోలీసులు, సిఆర్పిఎఫ్ సిబ్బంది వివిధ గ్రామాలకు చెందిన యువకులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.