Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ సంక్షేమ శాఖ అధికారిని(డిడి) సస్పెండ్ చేయాలి
- ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బి.వీరభద్రం
నవతెలంగాణ-కొత్తగూడెం
దమ్మపేట బీసీ హాస్టల్‌కు తాళాలు వేసి హాజరు చూపుతున్న వార్డెన్ ఎక్కడికో వెళ్ళిపోయారనీ, విద్యార్థులకు భోజనం పెట్టడం లేదనీ, తప్పుడు హాజరు చూపి బిల్లు క్లెయిమ్ చేస్తున్నారని, దీనికి జిల్లా బిసి సంక్షేమ శాఖ అధికారి సురేందర్ సహకరిస్తున్నారని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బుర్రా వీరభద్రం ఆరోపించారు. గతంలో బిసి సంక్షేమ శాఖ అధికారి సురేందర్ విద్యార్థుల నోట్ పుస్తకాలు, బ్లాంకెట్, టవల్స్, ఇతర స్టేషనరీని పక్కదారి మళ్ళించారని ఆరోపించారు. హాస్టల్ వార్డెన్లకు కొమ్ముకాస్తూ మెనూ పాటించకపోయినా చర్యలు తీసుకోవటం లేదన్నారు. తప్పుడు పద్దతుల్లో బిల్స్ క్లెయిమ్ చేస్తున్న వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న సంక్షేమ హాస్టళ్ల అద్దెల చెల్లింపులపై విచారణ జరపాలని, ప్రైవేట్ కళాశాలలకు మేలు చేసేందుకు గతంలో జిల్లా కేంద్రంలో హాస్టల్ వేరొక చోటికి కలెక్టర్ అనుమతి లేకుండా తరలించారని అన్నారు. సమస్యల వలయంలో బిసి సంక్షేమ శాఖ హాస్టళ్లు కొట్టమిట్టాడు తున్నాయని, వార్డెన్ల నుండి నెల వారీ కమీషన్లు తీసుకొని, మెనూ పాటించకపోయినా పట్టింపులు ఉండవన్నారు. బిసి సంక్షేమ శాఖలో టెండర్లు పిలవ కుండా ప్రతీది చేతి ఖర్చులు చేస్తున్నారని అన్నారు. దీనిపై పూర్తి విచారణ కలెక్టర్ ఆధ్వర్యంలో జరిపించాలని వీరభద్రం డిమాండ్ చేశారు.