Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 500 కుటుంబాలకు వైద్య పరీక్షలు,మందులు పంపిణీ
- ఏజెన్సీ ప్రాంత ప్రజల సమస్యలను తీర్చడమే లక్ష్యం : ఎస్పీ డా.వినీత్
నవతెలంగాణ-చర్ల
మండలంలోని కుర్నపల్లి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో సుమారుగా 500 కుటుంబాలకు గురువారం చర్ల పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కుర్నపల్లి, ఎర్రబోరు, బోదనెల్లి, రామచంద్రపురం, బత్తినపల్లి, కొండవాయి గ్రామాలకు చెందిన 500ల కుటుంబాలు ఈ వైద్య శిబిరంలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ డా.వినీత్ పాల్గొన్నారు. అన్ని విభాగాలలో నిపుణులైన వైద్యుల బృందం సహాయంతో వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ టి.సాయి మనోహర్, భద్రాచలం ఏఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ లు కూడా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న గుత్తికోయ గ్రామాల ప్రజల సమస్యలను పరిష్కరించడంలో భాగంగానే వైద్య శిబిరాలను ఏర్పాటు చేశామన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ప్రజల సంక్షేమం, అభివృద్ధికి జిల్లా పోలీస్ శాఖ నిరంతరం శ్రమిస్తుందని తెలియజేసారు.
అర్ధరాత్రి సమయాల్లో గ్రామాల్లోకి వచ్చి మావోయిస్టులు అమాయకపు ఆదివాసి గిరిజనులను చంపడం క్రూరమైన చర్య అన్నారు. ప్రజల మద్దతు లభించకనే అర్ధరాత్రి వేళల్లో ఇలాంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. అనంతరం చదువుకునే విద్యార్థులకు సోలార్ విద్యుద్దీపాలను అందించారు. కుర్నపల్లి గ్రామంలో పెద్ద ఎత్తున మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన చర్ల పోలీసులను ప్రత్యేకంగా అభినందించారు.
-ఇటీవల మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన కుర్నపల్లి ఉప సర్పంచ్ ఇర్పా రాముడు కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా ఎస్పీ
ఈ మధ్య కాలంలో కుర్నపల్లి గ్రామంలో మావోయిస్టుల చేతిలో క్రూరంగా హత్య చేయబడిన ఉప సర్పంచ్ ఇర్ఫా రాముడు ఇంటికి వెళ్లి అతని కుటుంబ సభ్యులను ఎస్పీ పరామర్శించారు. వారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా పోలీస్ శాఖ ఉంటుందని మనోధైర్యాన్ని నింపారు. అంతేకాకుండా ప్రభుత్వం తరఫున వారికి అందవలసిన అన్ని రకాల ప్రతిఫలాలను వీలైనంత త్వరలో అందేలా చర్యలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చర్ల సిఐ అశోక్, ఎస్సై రాజు వర్మ, గ్రామ సర్పంచ్ సరస్వతి, 141 సీఆర్పీఎఫ్ అధికారులు, భద్రాచలం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ రామకృష్ణ, వైద్యులు రాజశేఖర్, సునీల్, జగదీష్, రమాకాంత్ ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.