Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖమ్మంలోని హాస్పిటల్స్‌పై కొనసాగిన దాడులు
- వివరాలు బయటకు రాకుండా పలు జాగ్రత్తలు
- బిలీఫ్ హాస్పిటల్లో భారీగా అక్రమ సొమ్ము?
- ఎంపీ గాయత్రి రవి ఆఫీసుల్లోనూ సోదాలు..
- కేంద్రం తీరుపై మున్నూరుకాపుల ఆగ్రహం
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మంలో రెండోరోజూ ఆదాయపన్ను శాఖ అధికారుల దాడులు ప్రకంపనలు సృష్టించాయి. ఒకే యాజమాన్యానికి చెందిన ఖమ్మం వైరారోడ్డులోని బిలీఫ్ హాస్పిటల్, రోహిత్ టెస్టుట్యూబ్ బేబీ సెంటర్‌తో పాటు బాలాజీనగర్‌లోని శ్రీరాంకిడ్ని సెంటర్లో గురువారం కూడా ఐటీ, ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. మునుగోడు ఎన్నికల అనంతరం కొనసాగుతున్న ఈ దాడులపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా టీఆర్ఎస్ నేతలు, ఆ పార్టీకి ఆర్థికంగా సహకరిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో కొందరిని టార్గెట్ చేసుకుని ఈ దాడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌కు చెందిన ఆస్తులపై కరీంనగర్, హైదరాబాద్‌లో ఏకకాలంలో బుధవారం దాడులు నిర్వహించిన విషయం విదితమే. గురువారం కూడా మంత్రి ఆస్తులపై ఐటీ, ఈడీ దాడులు కొనసాగాయి. అదే క్రమంలో టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రకు చెందిన హైదరాబాద్‌లోని ఆఫీస్లపై గురువారం దాడులు నిర్వహించారు. మున్నూరు కాపు సామాజిక వర్గం, అది కూడా గ్రానైట్ వ్యాపారస్తులైన ఈ ఇద్దరు నేతలు లక్ష్యంగా దాడులు చేయడం బీజేపీ కుట్రలో భాగమేనని మున్నూరుకాపు నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఖమ్మంలోని ఓ రెస్టారెంట్లో ఆ సామాజికవర్గం నేతలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ ఈ దాడులను ఖండించారు. ఇప్పుడిప్పుడే ఆర్థికంగా బలోపేతం అవుతున్న మున్నూరుకాపు నేతలను టార్గెట్ చేసుకుని, ఇతర టీఆర్ఎస్ నాయకులను కూడా భయబ్రాంతులకు గురిచేయడం కోసమే కేంద్రం ఈ రకమైన దాడులకు పూనుకుందని ధ్వజమెత్తారు.
'బిలీఫ్' కథ వేరు...
ఖమ్మంలోని బిలీఫ్ హాస్పిటల్, అదే యాజమాన్యానికి చెందిన రోహిత్ టెస్టుట్యూబ్ బేబీ సెంటర్ల కథ మరోలా ఉంది. జిల్లాకు చెందిన ఓ ప్రముఖ టీఆర్ఎస్ నేత భార్యతో ఉన్న చుటరికం, వ్యాపార సంబంధాలు అడ్డుపెట్టుకుని బిలీఫ్ హాస్పిటల్ యాజమాన్యం విచ్చలవిడి దోపిడీకి పాల్పడుతోందనే అభియోగాలున్నాయి. ఈ సంబంధాల ఆధారంగానే ఆమె గతంలో నగర మేయర్ పదవి కోసం తనదైన శైలిలో పావులు కదిపారని, తగిన హామీ లభించకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారనే అభియోగాలు కూడా బిలీఫ్ హాస్పిటల్ ప్రధాన నిర్వాహకురాలు రమాదేవిపై ఉన్నాయి. ఈ ఆస్పత్రి నిర్వాహకులపై వస్తున్న ఆరోపణలకు తగినట్టుగానే దాడుల క్రమంలో భారీ మొత్తంలో అక్రమ సొమ్ము బయటపడుతున్నట్లు తెలుస్తోంది. బిలీఫ్ ఆస్పత్రి యాజమాన్యానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్తోనూ సంబంధాలున్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తగిన ఆధారాల కోసం ఈడీ దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఆస్పత్రి నిర్వాహకుల్లో ఒకరైన రమాదేవి ఆంధ్రాలో అప్పనంగా పోగేసిన వ్యాపార లావాదేవీలకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను కూడా ఐటీ, ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే రమాదేవి ఇటీవలనే కొణిజర్ల మండలంలో ఓ 15 ఎకరాల భూమి కొనుగోలు చేశారని, ఆమెకు అక్కడ చేపల చెరువులు సైతం ఉన్నాయని సమాచారం. సంతాన సాఫల్యం, నార్మల్ డెలివరీల పేరుతో పేద, ధనిక తారతమ్యం లేకుండా రూ.లక్షల్లో దోపిడీకి పాల్పడుతున్న నేపథ్యంలోనే బిలీఫ్ ఆస్పత్రిపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయనే అభియోగాలున్నాయి. మరోవైపు శ్రీరాం కిడ్ని సెంటర్‌పైన కూడా ఫిర్యాదులు అందిన క్రమంలోనే దాడులు చేస్తున్నారని తెలుస్తోంది.
ఐటీ, ఈడీ దాడులు...బెంబేలెత్తుతున్న వ్యాపారులు
ఐటీ, ఈడీ దాడులు అత్యంత గోప్యంగా కొనసాగుతున్నాయి. అధికారులు బృందాలుగా ఏర్పడి ఆస్పత్రులపై దాడులు కొనసాగిస్తున్నారు. ఒకరిద్దరు బయటకు వెళ్లినట్లే వెళ్లి తిరిగి మళ్లీ ఆస్పత్రికి వస్తున్నారు. కొందరు ఆస్పత్రుల్లోనే ఉండి సోదాలు నిర్వహిస్తున్నారు. సోదాలు నిర్వహిస్తున్న దరిదాపుల్లోకి ఎవరూ రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఏ చిన్న విషయం కూడా బయటకు రాకుండా చూస్తున్నారు. ఐటీ, ఈడీ దాడుల నేపథ్యంలో నగరంలోని వ్యాపారులు, ఆస్పత్రుల నిర్వాహకులు బెంబేలెత్తుతున్నారు. ఇప్పటికే ఆయా వ్యాపారాలు, ఆస్తులకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను బయటకు తరలించినట్లు సమాచారం.