Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం), సీపీఐ, టీఆర్ఎస్ డిమాండ్
నవతెలంగాణ- సత్తుపల్లి
తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ది చేయకుండా వివక్ష చూపుతున్న ప్రధాని మోదీ ఇక్కడ రావద్దని, మోదీ గో బ్యాక్ అంటూ సీపీఐ(ఎం), సీపీఐ, టీఆర్ఎస్ నాయకులు మోరంపూడి పాంగురంగారావు, దండు ఆదినారాయణ, ఎస్కే రఫీ డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక ప్రజా సంఘాల కార్యాలయంలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. అధికారంలోకి వచ్చేముందు ప్రజలకు అనేక వాగ్దానాలిచ్చిన మోదీ వాటిని విస్మరించారన్నారు. విభజన చట్టం హామీలను పూర్తిగా తుంగలో తొక్కారన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలను ఒకలాగా, తెలంగాణను మరోలా చూడటం కేంద్రానికి సరికాదన్నారు. దేశంలో అంతర్భాగంలో ఉన్న తెలంగాణపై బీజేపీకి ఇంత వివక్ష ఎందుకన్నారు. తెలంగాణ నుంచి పన్నులు వసూలు చేసే కేంద్రానికి న్యాయబద్దంగా రావాల్సిన నిధులను ఎందుకు ఇవ్వడం లేదని విమర్శించారు. మోదీ తెలంగాణ పర్యటనపై తెలంగాణ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు కొలికపోగు సర్వేశ్వరరావు, నిమ్మటూరి రామకృష్ణ, మల్లూరు అంకమరాజు, తురక వీరాస్వామి, మండూరి రవి పాల్గొన్నారు.
ఖమ్మంకార్పొరేషన్ : నిరుద్యోగ యువతను మోసం చేసిన మోడీ తెలంగాణ పర్యటనను యువత వ్యతిరేకించాలని డివైఎఫ్ఐ ఖమ్మం త్రీ టౌన్ కార్యదర్శి శీలం వీరబాబు పిలుపునిచ్చారు. స్థానిక డివైఎఫ్ఐ కార్యాలయంలో యర్రా నగేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో డివైఎఫ్ఐ త్రీ టౌన్ కార్యదర్శి శీలం వీరబాబు మాట్లాడుతూ. కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఖాళీగా ఉన్న 15 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని, రైల్వే ప్రైవేటీకరణను ఆపాలని కేంద్ర ప్రభుత్వం మినీ పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాలని ఆయన కోరారు.కార్యక్రమంలో డివైఎఫ్ఐ త్రీ టౌన్ ఉపాధ్యక్షులు యర్రా నగేష్, యర్రా సాయికుమార్, ఎస్కే పాషా, కూరపాటి వీరభద్ర, సంపంగుల లింగయ్య, వేల్పుల నాగేశ్వరరావు, సోమనబోయిన వెంకటేశ్వర్లు, సరికొండ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
గ్రామపంచాయతీలకు నిధుల విడుదల చేసిన తర్వాతనే పీఎం తెలంగాణకు రావాలి!
బోనకల్ : గ్రామ పంచాయతీలకు నిలిపివేసిన నిధులను వెంటనే విడుదల చేసిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రానికి రావాలని బోనకల్ సర్పంచులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీపీ కంకణాల సౌభాగ్యం, సర్పంచులు ఆళ్ల పుల్లమ్మ, కేతినేని ఇందు, నోముల వెంకట నరసమ్మ, సాదినేని చంద్ర, కళావతి, పెద్ద బీరవల్లి ఎంపీటీసీ కర్లకుంట దేవమణి మాట్లాడారు. తెలంగాణ గ్రామపంచాయతీలకు విడుదల చేయాల్సిన 15వ ఫైనాన్స్ నిధులను గత ఆరు నెలలుగా జాప్యం చేస్తూ నరేంద్రమోడీ, అమిత్ షాలు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. తెలంగాణ గ్రామపంచాయతీల మీద మీకు అంత కుట్ర ఎందుకని వారు ప్రశ్నించారు. తెలంగాణ పంచాయతీలు అభివద్ధి చెందటం ఇష్టం లేనీ బీజేపీ పెద్దలు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. గ్రామపంచాయతీలలో అభివృద్ధి పనులు ఎక్కడికికక్కడ నిలిచిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. చేసిన అభివృద్ధి పనులకు నెలల తరబడి బిల్లులు రాక, ఆర్థికభారం మోయలేక సర్పంచులందరూ అప్పుల పాలై తలలు పట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో సర్పంచ్‌లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం 6 నెలల నుంచి నిధులు విడుదల చేయకపోవడంతో సర్పంచ్ లు అనేక రకాలుగా ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బిల్లులు రాక రాష్ట్రంలో కొంతమంది సర్పంచ్‌లు ఈ ఆర్థిక భారం మోయలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వారు తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం గ్రామపంచాయతీలకు ఇవ్వాల్సిన ఎఫ్‌ఎఫ్‌సి నిధులను వెంటనే విడుదల చేసిన తర్వాతనే నరేంద్ర మోడీ తెలంగాణకు రావాలని డిమాండ్ చేశారు.