Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్
నవతెలంగాణ-కొత్తగూడెం
పోడు సర్వే ప్రక్రియకు వచ్చిన ప్రతి ధరఖాస్తును నిశిత పరిశీలన చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. పోడు సర్వే ప్రక్రియ, గ్రామసభలు నిర్వహణ తదితర అంశాలపై హైదరాబాదు నుండి సీఎస్ సోమేష్ కుమార్, పీసీసీఎఫ్ శోభ, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టినాజడ్ చోంగులతో కలిపి జిల్లా కలెక్టర్లు, ఎస్పీ, అటవీ, ఐటీడీఏ పీఓలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సర్వే పూర్తయిన గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించాలని తెలిపారు. ఈ నెల 20వ తేదీ వరకు పోడు భూముల సర్వే పూర్తి చేయుటకు అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. నూతనంగా అడవులు ఆక్రమణలు, అన్యాక్రాంతం కాకుండా పటిష్ట పర్యవేక్షణ చేపట్టాలని చెప్పారు. అడవుల పరిరక్షణపై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. ఈ సందర్భంగా సిఎస్ సోమేష్కుమార్ మాట్లాడుతూ పోడు భూముల సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పారు. ధరణి దరఖాస్తులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించు విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ హైదరాబాదు కలెక్టరేట్ నుండి ఈ వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 20వ తేదీలోగా సర్వే ప్రక్రియ పూర్తి చేయు విధంగా కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. జిల్లాలో 332 గ్రామ పంచాయతీలు, 726 హాబిటేషన్లులో పోడు సర్వే జరుగుతున్నదని చెప్పారు. సర్వే నిర్వహణకు అటవీ, రెవిన్యూ, పోలీస్, పంచాయతీరాజ్ సిబ్బందితో 305 టీములు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 299477.79 ఎకరాల్లో పోడు సమస్య ఉన్నదని, సర్వే నిర్వహణకు 83663 క్లెయిమ్స్ వచ్చినట్లు చెప్పారు. ఇప్పటి వరకు 52188 క్లెయిమ్స్ విచారణ నిర్వహించామని, 125139.23 ఎకరాలు సర్వే నిర్వహించినట్లు చెప్పారు. పెండింగ్ ఉన్న 31475 క్లెయిమ్స్ సత్వర విచారణ ప్రక్రియ పూర్తి చేయుటకు టీములు డిప్యూట్ చేయనున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఎస్పీ డాక్టర్ వినీత్.జీ, ఐటీడీఏ పీఓ గౌతం, జిల్లా అటవీ అధికారి రంజిత్ నాయక్ పాల్గొన్నారు.