Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీకి జిల్లా ప్రజల నిరసనల సెగ తగలాలి
- పేద, కార్మిక, కర్షకుల నినాదమే 'మోడీ గో బ్యాక్'
- సీపీఐ(ఎం), సీపీఐ జిల్లా కార్యదర్శులు కనకయ్య, సాబీర్ పాషా
నవతెలంగాణ-కొత్తగూడెం
విభజన చట్టాన్ని తుంగలో తొక్కి తెలంగాణకు అన్యాయం చేయడంతోపాటు కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను దోచిపెడుతున్న ప్రధాన మోడీకి తెలంగాణ రాష్ట్రంలో పర్యటించే అర్హత లేదని, తక్షణమే తన పర్యటనను రద్దు చేసుకొని వెనక్కు వెళ్లాలని సీపీఐ(ఎం), సీపీఐ జిల్లా కార్యదర్శులు అన్నవరపు కనకయ్య, ఎస్కె.సాబీర్ పాషా డిమాండ్ చేశారు. నవంబర్ 12న మోడీ పర్యటను సందర్భంగా జిల్లాలో చేపట్టాల్సిన నిరసన కార్యక్రమాలపై చర్చించిన అనంతరం జరిగిన ఇరు పార్టీల సంయుక్త సమావేశంలో వారు మాట్లాడారు. మోడీ ప్రభుత్వం దేశ ప్రజల కోసం కాకుండా ఆధానీ, అంబానీ లాంటి కుబేరులకు కోసం పనిచేస్తున్నాడని విమర్శించారు. విభజన చట్టంలోని బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట కోట్ ఫ్యాక్టరీ, గిరిజ విశ్వవిద్యాలయం ఏర్పాటు నిర్లక్ష్యం చేస్తూ తెలంగాణ పట్ల వివక్షత చూపుతున్నారన్నారని మండిపడ్డారు. ఒవైపు ప్రభుత్వ రంగ సంస్థలను అదానీ, అంబానీలకు దారాదత్తం చేస్తూ మరో పక్క రామగుండం ఎరువుల కర్మాగరాన్ని జాతికి అంకితం చేస్తున్నామని తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే కుట్రలు చేస్తున్నారన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి లక్షలాది మంది ఉద్యోగులను, కార్మికులను రోడ్డుపాలు చేస్తున్నారని, కార్మికవర్గం పోరాడి సాధించుకున్న చట్టాలను యాజమాన్యాలకు అనుకూలంగా మార్చే చర్యలకు పాల్పడుతున్నారన్నారని విమర్శించారు. ఎనిమిదేళ్ళ కాలంలో తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం చేసిందేమీలేదని, వివక్షతతో రాష్ట్రాన్ని దివాలా తీయించే చర్యలకు పూనుకుంటున్నారన్నారు. పేద ప్రజల, కార్మిక, కర్షకుల నినాదమే 'మోడీ గో బ్యాక్' అని అయన పర్యటనను అడ్డుకొని తీరతామన్నారు. అరెస్టులకు, నిర్భందాలకు పాల్పడితే రామగుండం రణరంగంగా మారుతుందని హెచ్చరించారు. మోడీకి జిల్లా ప్రజలు నిరసనల సెగ తగిలేలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాలని వామపక్ష శ్రేణులకు వారు పిలుపు నిచ్చారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గుత్తుల సత్యనారాయణ, సీపీఐ(ఎం) జిల్లా నాయకులు అన్నవరపు సత్యనారాయణ, సీపీఐ(ఎం), సీపీఐ నాయకులు లిక్కి బాలరాజు, జె.గట్టయ్య తదితరులు పాల్గొన్నారు.