Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యాశాఖ అధికారి సోమశేఖర్ శర్మ
నవతెలంగాణ-బూర్గంపాడు
ఉపాధ్యాయులు అంకితభావంతో పని చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యా శాఖ అధికారి సోమశేఖర్ శర్మ అన్నారు. మండలంలోని సారపాకలో గల ఐటీసీ బీపీఎల్ పాఠశాలలో భద్రాచలం, బూర్గంపాడు మండలాల ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులతో తొలిమెట్టు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల హాజరు శాతం పెంచితే తొలిమెట్టు విజయవంతం అవుతుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ నెలలలో తొలిమెట్టు అమలు, పిల్లల ప్రగతిపై వివిధ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులతో చర్చించారు. ఈ నెల 10వ తేదీ నుండి 30వ తేదీ వరకు రెండవ విడత తొలిమెట్టు అమలు కై పలు సూచనలు చేశారు. ప్రతి రోజు సాయంత్రం ఒక అరగంట పాటు పిల్లలతో ఎక్కాలు, ఇంగ్లీష్ పదాలు, కొన్ని తెలుగు పద్యాలు, బిగ్గరగా చదివించాలని, అలాగే ప్రతి ఉపాధ్యాయుడు పిల్లలతో ఆంగ్లంలో మాట్లాడించాలని, దీనికై జిల్లా విద్యా శాఖ పంపిణీ చేసిన ఆంగ్ల మాడ్యుల్‌ను విరివిగా ఉపయోగించాలని ఆయన తెలిపారు. ఉపాధ్యాయులు వారి వారి పాఠశాలల్లో తొలిమెట్టు అభివృద్ధికి అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి సమ్మయ్య, జిల్లా అకాడ మిక్ కో ఆర్డినేటర్ నాగరాజ శేఖర్, సమ్మిళితం విద్యా కో ఆర్డినేటర్ సైదులు, జిల్లా సహాయ గణాంక అధికారి సతీష్, బీపీఎల్ పాఠశాల ప్రిన్సిపాల్ ప్రశాంత్ కుటుకులే, రెండు మండలాల తొలిమెట్టు నోడల్ అధికారులు రమ, నీరజ, అన్ని పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.