Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి
రచ్చ నరసింహారావు డిమాండ్
నవతెలంగాణ-నేలకొండపల్లి
చెరకు టన్నుకు రూ.3500 మద్దతు ధర చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం మండల కార్యదర్శి రచ్చ నరసింహారావు స్థానిక షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. శనివారం స్థానిక రావెళ్ల భవనంలో తెలంగాణ రైతు సంఘం మండల కమిటీ సమావేశం సంఘం మండల అధ్యక్షుడు అశోక్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరకు మద్దతు ధరను ప్రకటించకుండా నేడు మధుకాన్ షుగర్ ఫ్యాక్టరీలో చెరుకు క్రసింగ్ ను ప్రారంభించడం రైతుల పట్ల ఫ్యాక్టరీ యాజమాన్యానికి ఉన్న నిర్లక్ష్యానికి అద్దం పడుతుందన్నారు. ప్రతి ఏటా చెరుకు మద్దతు ధర విషయంలో రైతులందరిని సమీకరించి రైతు సదస్సు నిర్వహించి వారి సూచనలు సలహాలు మేరకు మద్దతు ధర ప్రకటించే ఆనవాయితీని యాజమాన్యం విస్మరించడం రైతులను మోసం చేయడమేనన్నారు. పెరిగిన నిత్యవసర సరుకుల ధరలతో పాటు చెరుకు సాగు ఖర్చులు, పెట్టుబడులు, చెరుకు కటింగ్ తోలకం వంటి అనేక ఖర్చులు భారీగా పెరిగినా మద్దతు ధర పెంచే విషయంలో యాజమాన్యం ఏమాత్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ప్రతి ఏటా పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో ప్రస్తుతం చెరుకు టన్నుకు నాలుగు వేల రూపాయలు చెల్లించడం ద్వారా రైతులకు కొంత ఉపశమనం కలుగుతుందన్నారు. అందుకు విరుద్ధంగా ఏటా ఎంతో కొంత పెంచే ఆనవాయితీని కూడా విస్మరించడంతోపాటు రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం యాజమాన్య అహంకారానికి అద్దం పడుతుందన్నారు.కనీసం 3500 రూపాయలు చెల్లించి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేనియెడల రైతులను సమీకరించి ఆందోళనకు పూనుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర నాయకులు గుడవర్తి నాగేశ్వరరావు, రాసాల కనకయ్య, కె.వి రామిరెడ్డి, పగిడికత్తుల నాగేశ్వరరావు, బలుసు హనుమంతరావు, కట్టెకోల వెంకటేశ్వర్లు, ఎలమద్ది వెంకటేశ్వర్లు, ఏలూరి రామారావు, వాసంశెట్టి నాగేశ్వరరావు, గురజాల ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.