Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎనిమిదేళ్ళలో తెలంగాణకు మోడీ ఏం చేశాడని పర్యటనలు
- సీపీఐ, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శులు సాబీర్ పాషా, కనకయ్య
- మోడీ పర్యటన నేపథ్యంలో సీపీఐ,సీపీఐ(ఎం) నేతల అరెస్ట్-పోలీస్ స్టేషన్లకు తరలింపు
నవతెలంగాణ-కొత్తగూడెం
విభజన చట్టాలను తుంగలో తొక్కి రాజకీయ కక్షతో తెలంగాణకు అడుగడుగునా అన్యాయం చేస్తున్న నరేంద్ర మోడీకి తెలంగాణగడ్డపై అడుగు పెట్టే నైతిక హక్కు లేదని, గడిచిన ఎనిమిదేళ్ళలో తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని నిలదీస్తున్న తెలంగాణ సమాజానికి సమాదానం చెప్పాలని సీపీఐ, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శులు సాబీర్ పాషా, అన్నవరపు కనకయ్యలు ప్రశ్నించారు. మోడీ తెలంగాణ పర్యటను నిరసిస్తూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు పిలుపు నిచ్చిన నేపద్యంలో శనివారం సీపీఐ, సీపీఐ(ఎం) నేతలు, కార్యకర్తలను అరెస్టు చేశారు. తెల్లవారు జామున ఇండ్లలో నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లలో నిర్భందించారు. అరెస్టుఅయిన పార్టీల శ్రేణులు మోడీ గోబ్యాక్ అంటూ పోలీస్ స్టేషన్లలో తమ నిరసనను వ్యక్తం చేశారు. పలు చోట్ల రస్తారోకోలు, మోడీ దిష్టి బొమ్మలు దహనం చేశారు. ఈ సందర్భంగా అరెస్టు అయిన వారు మాట్లాడుతూ విభజన చట్టంలోని బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, జాతీయ స్థాయి విద్యాసంస్థల ఏర్పాటులో కేంద్రం తెలంగాణ పట్ల వివక్షత చూపుతుందన్నారు. సరళీకరణ, ప్రైవేటీకరణ పేరిట ప్రజలపై గుదిబండ మోపుతున్నారని, లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా కార్పోరేట్ శక్తులకు కట్టబెడుతున్నారని విమర్శించారు. మతోన్మాదాన్ని పెంచిపోషిస్తూ ప్రజల మధ్య చిచ్చు రేపుతున్నారని, ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తున్న బీజేపీకి తెలంగాణలో స్థానం ఇవ్వబోమన్నారు. తెలంగాణకు ఏ ఒక్క మేలు చేయకుండా తెలంగాణలో మోడీ అడుగు పెట్టిన నవంబర్ 12 ముమ్మాటికి తెలంగాణ ప్రజలకు చీకటి రోజేనని అన్నారు. ప్రజలపై నిర్భందాలకు పాల్పడుతున్నారని, తెలంగాణ కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ఇక్కడి ప్రజలకు నిర్భందాలు కొత్తేమీ కాదన్నారు. రామగుండంలో అరెస్టు చేసిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతోపాటు, రాష్ట్ర వ్యాపితంగా అరెస్టు చేసిన సీపీఐ(ఎం), సీపీఐ నాయకులు, కార్యకర్తలను భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, జిల్లా నాయకులు భూక్య రమేష్, నాగేశ్వరరావు, జునుమాల నగేష్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బందెల నర్సయ్య, దుర్గరాశి వెంకటేశ్వర్లు, వై.శ్రీనివాసరెడ్డి, సలిగంటి శ్రీనివాస్, జిల్లా సమితి సభ్యులు జి.వీరస్వామి, కందుల భాస్కర్, కంచర్ల జమలయ్య, వాసిరెడ్డి మురళి, దీటి లక్ష్మిపతి, గుండు శ్రీనివాస్ అరెస్టు అయిన వారిలో ఉన్నారు.