Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ ప్రభుత్వ విధానాల వల్ల సంక్షోభంలో దేశం
- వలస ఆదివాసీలకు కూడా పోడు పట్టాలు ఇవ్వాలి
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-కొత్తగూడెం
వలస ఆదివాసీలకు కూడా పోడు పట్టాలు ఇవ్వాలని, సీపీఐ(ఎం) పోరాటాల ఫలితంగానే పోడు భూముల సర్వే ప్రభుత్వం నిర్వహిస్తున్నదని, వెంటనే పట్టాలు ఇవ్వాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి, ఖమ్మం జిల్లా మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మంచికంటి భవన్లో మచ్చా వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో తమ్మినేని పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో బతుకుదేరువు కోసం వచ్చి పోడు భూములు సాగుచేసుకుంటున్న వలస ఆదివాసీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చి వారి భూములను సర్వే చేసి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారికి కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని కోరారు. అదేవిదంగా దేశంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు దేశ భవిష్యత్తుకు ప్రమాదకరంగా ఉన్నాయని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసిందని, నిరుద్యోగం విలయ తాండవం చేస్తుందన్నారు. రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నదని విమర్శించారు.
అనంతరం సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ మాట్లాడుతూ విద్యుత్ రంగం ప్రయివేటుపరం చేస్తుందని, దీంతో వ్యవసాయ రంగం దివాలా తీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టే కుట్రలు బీజేపీ చేస్తుందన్నారు. రాజ్యాంగాన్ని ద్వంసం చేస్తూ, ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టిస్తోందని విమర్శించారు. తెలంగాణ ప్రజలు బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలన్నారు. బీజేపీ ప్రభుత్వం ధరలు విపరీతంగా పెంచి జనం డబ్బు దోచుకుంటున్నదని, అంబానీ, అదానీలకు దేశ సంపద కారుచౌకగా కట్టబెడుతుందని విమర్శించారు. ప్రజలు దోపిడీ దారుల నుండి దేశాన్ని కాపాడుకోవడం కోసం పోరాటం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏజే.రమేష్, కొక్కెరపాటి పుల్లయ్య, కె.బ్రహ్మచారి, బాలనర్సారెడ్డి, కారం పుల్లయ్య, లిక్కి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు కున్సోత్ ధర్మ, సరియం రాజమ్మ, పద్మ, రేపాకుల శ్రీనివాస్, అన్నవరపు సత్యనారాయణ, నిమ్మల వెంకన్న, బి.చిరంజీవి, యలమంచి వంశీకృష్ణ, నభీ, కొండపల్లి శ్రీధర్, భూక్యా రమేష్, కొండబోయిన వెంకటేశ్వర్లు, పిట్టల అర్జున్, దొడ్డ రవి, కోటేశ్వరరావు, శ్రీను, మర్మం చంద్రయ్య, దొడ్డ లక్ష్మినారాయణ, ముదిగొండ రాంబాబు, వీర్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.