Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సత్యవతి రాథోడ్
- అట్టహాసంగా గిరిజన గురుకుల రాష్ట్ర స్థాయి క్రీడలు ప్రారంభం
- పోటీల ప్రారంభ వేడుకకు హాజరైన పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు
నవతెలంగాణ-భద్రాచలం
గిరి బిడ్డల ప్రగతికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర గిరిజన, మహిళ, శిశు సంక్షేమ శాఖామాత్యులు సత్యవతి రాథోడ్ అన్నారు. భద్రాచలం గిరిజన గురుకుల ప్రాంగణంలో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ గురుకుల బాలికల 6వ రాష్ట్రస్థాయి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. ముందుగా గురుకుల ప్రాంగణానికి చేరుకున్న మంత్రి సత్యవతి రాథోడ్‌కి ఘన స్వాగతం లభించింది. భద్రాచలం గిరిజన గురుకుల కళాశాల, పాఠశాల ప్రిన్సిపాల్ ఎం.దేవదాసు ఈ సందర్భంగా అధికారులను, పీడీ, పీఈటీలను మంత్రివర్యులకు పరిచయం చేశారు. మంత్రి ప్రారంభ సూచికగా జ్యోతి ప్రజ్వలన గావించారు. తదుపరి గిరిజన గురుకుల పిల్లలు ప్రార్థన గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఒలంపిక్ క్రీడా పతాకాన్ని భద్రాచలం శాసనసభ్యులు పోదెం వీరయ్య ఆవిష్కరించగా, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యురాలు మాలోత్ కవిత సొసైటీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మంత్రివర్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు క్రీడాకారిణీల మార్చ్ ఫాస్ట్ ద్వారా గౌరవ వందనాన్ని స్వీకరించారు. తదుపరి క్రీడాకారిణీలు లైటింగ్ ఆఫ్ టార్చ్ ప్రోగ్రాం నిర్వహించారు. ఐటీడీఏ ఏపీఓ జనరల్, గిరిజన గురుకుల ప్రాంతీయ సమన్వయ అధికారి హెచ్ డేవిడ్ రాజ్ రాష్ట్రస్థాయి క్రీడల రిపోర్టును ప్రవేశపెట్టారు.
గిరిజన విద్యార్థుల సంక్షేమంకు ప్రభుత్వం పెద్దపీట : మంత్రి సత్యవతి రాథోడ్
రాష్ట్ర ప్రభుత్వం గిరిజన విద్యార్థుల సంక్షేమంకు పెద్దపీట వేసిందని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. భద్రాచలం గిరిజన గురుకుల పాఠశాల, కళాశాల ప్రాంగణంలో గురుకులాల 6వ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలను లాంఛనంగా ప్రారంభించిన అనంతరం ఆమె ప్రసంగించారు. చక్కని మెనూతో పౌష్టికాహారం గిరిజన బిడ్డలకు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో 90 ఉన్న గురుకుల పాఠశాలలు ప్రస్తుతం 183 వరకు పెంచడం జరిగిందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ కలలుగన్న విధంగా రాష్ట్రంలో విద్యా విధానం కొనసాగుతోందని ప్రశంసించారు. గిరిజన విద్యార్థినీ, విద్యార్థులు నేడు అన్ని రంగాల్లో ప్రగతి పథంలో దూసుకు వెళ్తున్నారన్నారు. ఈ పోటీలను పకడ్బందీగా నిర్వహించేలా చక్కని ఏర్పాట్లు చేసిన స్థానిక అధికారులను మంత్రి అభినందించారు. అనంతరం భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గౌతమ్ పోట్రూ మాట్లాడుతూ... గిరిజన బాలబాలికల సంక్షేమం కోసం, వారిలో విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు భద్రాచలం ఐటీడీఏ ద్వారా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యతోపాటు వారిని అన్ని రంగాల్లో తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఎమ్మెల్యే పొదెం వీరయ్య మాట్లాడుతూ...క్రీడలు బాలబాలికలకు ఎంతో అవసరమని సూచించారు. క్రీడలు మానసిక శారీర, ఉల్లాసానికి అవసరమని తెలిపారు. గిరిజన పిల్లలు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. మహబూబాబాద్ పార్లమెంటు సభ్యురాలు మాలోతు కవిత మాట్లాడుతూ... గిరిజన బాలబాలికలు చదువుతోపాటు, క్రీడల్లో కూడా రానిస్తే ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ఇటువంటి అవకాశాలను యువత సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలను అందుకోవాలని కోరారు. జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య మాట్లాడుతూ... పిల్లలు చిన్నప్పటి నుంచే ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని పెట్టుకొని ఆ దిశగా ముందుకు సాగి గమ్యస్థానాన్ని చేరుకోవాలని కోరారు. అడిషనల్ సెక్రటరీ వి.సర్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ గిరిజన గురుకుల సొసైటీ ద్వారా విద్యా ప్రగతికి ఎన్నో విధాల ప్రయత్నం జరుగుతోందని వెల్లడించారు. అందువల్లే గిరిజన పిల్లలు అభివద్ధి బాటన పయనిస్తున్నారని తెలిపారు. ఐటీడీఏ ఏపీవో జనరల్, గిరిజన గురుకులాల ప్రాంతీయ సమన్వయ అధికారి హెచ్.డేవిడ్ రాజ్ మాట్లాడుతూ... భద్రాచలం ఐటీడీఏ ద్వారా ఎప్పటికప్పుడు విద్యపై ప్రత్యేక ఫోకస్ పెడుతూ గిరిజన పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయటం జరుగుతోందన్నారు. ఈ క్రీడల ప్రారంభోత్సవ వేడుకలో భద్రాచలం స్పెషల్ ఆఫీసర్ నాగలక్ష్మి, భద్రాచలం గిరిజన గురుకుల పాఠశాల కళాశాల ప్రిన్సిపాల్ ఎం.దేవదాసు, స్టాఫ్, భద్రాచలం ఐటిడిఏ వివిధ శాఖల యూనిట్ అధికారులు, పలువురు ప్రజా ప్రతినిధులు, వివిధ గురుకుల పాఠశాలల, కళాశాలల ప్రిన్సిపాల్స్, స్టాఫ్, పలువురు పీడీలు, పీఈటీలు, క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన బాలికలు, వారి ఇన్చార్జులు తదితరులు పాల్గొన్నారు.