Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామపంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచాలి
- మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి
- సీఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తుమ్మ విష్ణువర్ధన్, కళ్యాణం వెంకటేశ్వరరావు
నవతెలంగాణ-ఖమ్మం
పంచాయితీ సిబ్బందికి వ్యతిరేకంగా ఉన్న నష్టదాయక అంశాలను సవరించాలని, మల్టీపర్పస్ వర్కర్స్ విధానం రద్దు చేయాలని, కారోబార్, బిల్ కలెక్టర్లకు స్పెషల్ స్టేటస్ కల్పించాలని, ఎస్కే-డే పేరిట ప్రవేశపెట్టిన రూ.2 లక్షల ఇన్సూరెన్స్‌ను వెంటనే అమలుచేయాలని, కార్మికులపై రాజకీయ వేధింపులు, తొలగింపులను నివారించాలని సీఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తుమ్మ విష్ణువర్ధన్, కళ్యాణం వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఆదివారం ఖమ్మం లోని మంచి కంటి ఫంక్షన్ హాల్ లో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా ఆరవ మహాసభ జరిగింది. ఈ సభలో వారు మాట్లాడుతూ ఇప్పటి వరకూ రాష్ట్రంలోని గ్రామ పంచాయితీ కార్మికులంతాపోరాటాల ద్వారానే వేతనాలు పెంచుకున్నారు. ఇతర హక్కులు సాధించుకున్నారని వారు తెలిపారు. కాని ఇప్పడు బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త కోడ్ల వల్ల రాష్ట్రంలో గ్రామ పంచాయితీ కార్మికులు తమ డిమాండ్లను పరిష్కరించమని అడిగే హక్కే లేకుండా పోతుందని అన్నారు. ఈ బిజెపి ప్రభుత్వ విధానాల వల్ల ఉద్యోగులు, కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, సామాన్య ప్రజల జీవితాలను బలిచేసి పెట్టు బడిదారులకు, పారిశ్రామికవేత్తలకు, కార్పొరేట్ శక్తులకే ప్రయోజనం చేకూరుస్తుందని వారు విమర్శించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా 30 నెలలుగా పిఆర్సి పేరుతో కాలయాపన చేసి పంచాయతీ సిబ్బంది
ఆశలపై నీళ్ళు చల్లింది. పిఆర్సిలో కనీస వేతనం రూ.19 వేలు ఇవ్వాలని, కమీషన్ సిఫారసు చేసింది. దాన్నే పంచాయితీ సిబ్బందికి కనీస వేతనాలుగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. నూతన అధ్యక్ష,కార్యదర్శులుగా వి.సుధాకర్ రెడ్డి, ఎన్. నాగరాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా సిఐటియు జిల్లా అధ్యక్షులు తుమ్మ విష్ణువర్ధన్‌ని, ఆర్గనైజింగ్ సెక్రటరీగా పెరుమాళ్ళపల్లి మోహన్ రావు, కోశాధికారిగా నాగేశ్వరరావు తోపాటు మరో 30 మందితో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ మహాసభలో సిఐటియు జిల్లా నాయకులు ఎం.గోపాల్, పి.రమ్య, కే నరేందర్, టీఎస్ కళ్యాణ్, వీరన్న, యూనియన్ నాయకులు హాసన్, హుస్సేన్, పాష, లక్క రామారావు, బొడ్డు ఆంజనేయులు భాస్కర్ ,నల్లమోతు నరేష్, శ్రీను, లాలయ్య, తదితరులు పాల్గొన్నారు.