Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి పువ్వాడ
నవతెలంగాణ-ఖమ్మం
రాష్ట్ర ఆర్టీసీ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల ఆరోగ్యంపై టీఎఎస్ ఆర్టీసీ యాజమాన్యం 'గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ పేరిట హెల్త్ క్యాంప్ చేపట్టిందని, వారి ఆరోగ్య బాధ్యత సంస్థపై ఉందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఆదివారం ఖమ్మంలోని ఖమ్మం బస్ స్టాండ్ లో నిర్వహించిన టీఎస్ఆర్టీసి గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ ను మంత్రి పువ్వాడ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సంస్థలోని వివిధ విభాగాల్లో పని చేస్తున్న సుమారు 50 వేల మంది ఉద్యోగులకు రోగ నిర్ధారణ పరీక్షలు చేసి 'హెల్త్ ప్రొఫైల్' రూపొందించనున్నామని పేర్కొన్నారు. ఉద్యోగులు ఆరోగ్యపరంగా సరిగ్గా ఉంటేనే సంస్థ ఆర్థికంగా పురోగతి సాధిస్తుందన్నారు. గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్‌ను విజయవంతం చేస్తున్న ఆర్టీసీ డీఎంలు, రీజియన్ మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకు, వైద్యులకు, సిబ్బందిని మంత్రి పువ్వాడ అభినందించారు. ఉద్యోగుల ఆరోగ్య రక్షణతో పాటు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు హెల్త్ ప్రొఫైల్ ఉపయోగపడుతుందన్నారు. ఉద్యోగులు తార్నాకలోని ఆర్టీసీ ప్రధాన ఆస్పత్రిలో ఉద్యోగుల ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ డేటా బేస్‌లో సమగ్ర సమాచారం నిక్షిప్తం చేయనున్నట్టు చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో ఖమ్మం లోని మమత ఆసుపత్రిలో వైద్య చికిత్సలు ఉచితంగా పొందేందుకు ఆదేశాలు ఇస్తామని, ఉద్యోగులు అన్ని వైద్య చికిత్సలు ఉచితంగా పొందాలని సూచించారు. కేవలం ఉద్యోగుల స్వయం శక్తిపైనే ఆర్టీసి సంస్ధ నడుస్తుందని, ఇది మనందరి సంస్థ అని.. దీనికి యజమానులు, కార్మికులు ఎవరు లేరని అన్నారు. 70కోట్ల నష్టం ఉన్న ఖమ్మం రీజియన్ ను రూ.10కోట్లకు తగ్గించుకుని.. నేడు ఖమ్మం డిపో లాభాల్లోకి తీసుకురావడం గర్వకారణం అని అన్నారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ విజరు కుమార్, కార్పొరేటర్ పగడాల శ్రీవిద్య, ఏఎంసీ చైర్మన్ లక్ష్మీ ప్రసన్న, ఆర్టీసీ ఆర్ఎం ఎస్తేర్ ప్రభులత, డివిఎం భవాని ప్రసాద్, ఖమ్మం యూనిట్ వైద్యులు గిరిసింహా రావు, సీనియర్ మెడికల్ అధికారి శైలజ, శ్రీనివాసరావు, డిపో మేనేజర్ శంకర్ రావు, పర్సనల్ ఆఫీసర్ విలాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాళోజీ నేటి తరానికి ఆదర్శం : మంత్రి పువ్వాడ.
ప్రత్యేక తెలంగాణ కావాలి, రావాలి అని తన జీవితాన్ని తెలంగాణ కోసం త్యాగం చేసిన మహౌన్నత వ్యక్తి కాళోజీ నారాయణరావు నేటి తరానికి ఆదర్శమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ప్రజా కవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణ రావు వర్థంతి సందర్భంగా ఖమ్మం బస్ స్టాండ్ ఆర్ఎం ప్రభులత అధ్వర్యంలో నిర్వహించిన హెల్త్ క్యాంప్ లో అయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.