Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-ఖమ్మం
మోడీ బెదిరింపు చర్యలకు తెలంగాణ ప్రజలు భయపడరని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆదివారం ఖమ్మం రూరల్ మండలం ముత్తుగూడెం గ్రామంలోని అమరజీవి చిన్నం మొలకయ్య 36 వర్ధంతి సభ పార్టీ గ్రామ కార్యదర్శి రేగళ్ల రాములు అధ్యక్షతన జరిగింది. ఈ సభలో ఆయన మాట్లాడుతూ సంవత్సరం క్రితం రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభమైతే దానిని ఇప్పుడు ప్రారంభించడానికి వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మోడీ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను బెదిరిస్తూ ఆయన చేసిన ప్రసంగం సరైంది కాదని ఖండించారు. మెలకయ్య గ్రామంలో చురుకైన కార్యకర్తగా పనిచేస్తున్న క్రమంలో 1986లో దుండగులు దారుణంగా హతమార్చారని తెలిపారు. అందుకే మొలకయ్య చూపిన బాటలోని ప్రతి కార్యకర్త పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. తొలుత తమ్మినేని వీరభద్రంకి గ్రామ ప్రజలు మేళతాళాలతో ఘనంగా స్వాగతం పలికారు. గ్రామంలో ప్రదర్శన నిర్వహించి అమరజీవి చిన్న మొలకయ్య స్తూపం వరకు వెళ్లి నివాళులర్పించారు. ఈ సభలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్, మండల కార్యదర్శి నండ ప్రసాద్, నాయకులు ఉరాడి సుదర్శన్ రెడ్డి, తోట పెద్ద వెంకటరెడ్డి, నందిగామ కృష్ణ, పి.సంగయ్య, తాటి వెంకటేశ్వర్లు, పున్నం సంగయ్య, జానీ, టి.వెంకటరమణ, వడ్లమూడి నాగేశ్వరరావు, కే. గురవయ్య, బి. నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.