Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఎఫ్ఆర్డీఏ చట్టాన్ని రద్దు చేయాలి...
- ఉపాధ్యాయుల ప్రమోషన్, బదిలీల షెడ్యూల్ ప్రకటించాలి
- 20న వైరాలో ఐదో జిల్లా మహాసభను విజయవంతం చేయాలి
- టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
పీఎఫ్ఆర్డీఏ చట్టాన్ని రద్దుచేసి, దేశవ్యాప్తంగా పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, కనీసం పాత పెన్షన్ విధానంలోకి మారడానికి రాష్ట్రాలకు స్వేచ్ఛనిచ్చే విధంగా చట్టాన్ని సవరించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉపాధ్యాయుల ప్రమోషన్, బదిలీల షెడ్యూల్ ప్రకటించాలని కోరారు. యూనియన్ అధ్యక్షులు జి.నాగమల్లేశ్వరరావు అధ్యక్షతన ఖమ్మంనగరంలోని స్థానిక యూటీఎఫ్ భవనంలో సోమవారం నిర్వహించిన సంఘం జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశంలో రవి మాట్లాడారు. ''జాతీయ పెన్షన్ పథకాన్ని అంగీకరించి అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలకు బయటకు వచ్చే స్వేచ్ఛ లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించటాన్ని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టిఎస్ యుటిఎఫ్) తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ప్రపంచ బ్యాంకు షరతులకు లోబడి కార్పొరేట్ వ్యాపారుల షేర్ మార్కెట్ వ్యాపారంలో ఫైనాన్స్ క్యాపిటల్ గా పబ్లిక్ మనీని వినియోగించుకోవటానికే చందాతో కూడిన పింఛన్ పథకాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. కార్పొరేట్ల ప్రయోజనాలు కాపాడటానికే నిర్మలా సీతారామన్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని ఎస్టీఎఫ్ఐ జాతీయ ఉపాధ్యక్షుడి హౌదాలో చావా రవి విమర్శించారు. 2004లో బీజేపీ ప్రభుత్వం జాతీయ పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టగా తదనంతరం అధికారంలోకి వచ్చిన యూపీఏ ప్రభుత్వం దొడ్డిదారిన రాష్ట్రాల్లో ఎన్పీఎస్ ను అమలు చేసిందని గుర్తుచేశారు. కుటుంబాల సామాజిక భద్రత పట్ల ఆందోళన చెందుతున్న సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు దేశవ్యాప్తంగా సిపిఎస్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నాయన్నారు. ప్రజలకు చెందాల్సిన పెన్షన్ సొమ్ము ప్రభుత్వాలకు కాదని వ్యాఖ్యానించిన కేంద్ర ఆర్థిక మంత్రికి నిజంగా ప్రజలపై ప్రేమే ఉంటే పీఎఫ్ఆర్డీఏ చట్టాన్ని రద్దు చేసి, పాతపెన్షన్ విధానం, జనరల్ ప్రావిడెంట్ ఫండ్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. జాతీయ విద్యావిధానం, జాతీయ పింఛన్ పథకం రద్దు కోరుతూ ఎస్టీఎఫ్ఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న సంతకాల సేకరణలో రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న బదిలీలు, ప్రమోషన్ షెడ్యూల్‌ను వెంటనే ప్రకటించాలన్నారు. బకాయి ఉన్న 3విడతల డీఏను ప్రకటించాలనీ, ఉపాధ్యాయుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు.
5వ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి
ఈనెల 20న వైరాలో నిర్వహించే టీఎస్ యూటీఎఫ్ ఖమ్మం జిల్లా 5వ మహాసభలను జయప్రదం చేయాలని రాష్ట్ర ఉపాధ్యక్షులు చావ దుర్గాభవాని, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నాగమల్లేశ్వరరావు, పారుపల్లి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా నాయకులు బుర్రి వెంకన్న, షేక్ షమీ, వల్లం కొండ రాంబాబు, షేక్ రంజాన్, ఏ.సుధాకర్, బి.మంగీలాల్, డి.నాగేశ్వరరావు, రమేష్, నరసయ్య, లక్ష్మణరావు, నిర్మలకుమారి, సురేష్, రామారావు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.