Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు, రేపు జిల్లా మూడవ మహాసభలు
- తొలిరోజు భారీ కార్మిక ప్రదర్శన, బహిరంగ సభ
- హాజరుకానున్న ఎం.సాయిబాబు, మిడియం బాబురావు, పాలడుగు భాస్కర్
నవతెలంగాణ-భద్రాచలం
నిరంతరం కార్మిక వర్గ సమస్యలపై సమరశీల పోరాటాలు చేస్తున్న సీఐటీయూ జిల్లా మూడవ సభలు పోరాటాల గడ్డ భద్రాచలంలో నేడు, రేపు జరుగుతున్నాయని జిల్లా కార్యదర్శి ఏజే రమేష్ తెలిపారు. ఈ మహాసభల సందర్భంగా బుధవారం జరిగే కార్మిక మహా ప్రదర్శన, బహిరంగ సభకు ముఖ్య అతిథిగా సీఐటీయూ అఖిలభారత ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబా, మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మీడియం బాబురావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, రాష్ట్ర కార్యదర్శి బి.మధు హాజరవుతున్నారని ఏజే రమేష్ తెలిపారు. జిల్లా అంగన్వాడి, ఆశ, మధ్యాహ్నం భోజనం, గ్రామదీపికలు, గ్రామపంచాయతీ, హాస్టల్ డైలీ వేస్, భవన నిర్మాణం తదితర అసంఘటిత రంగాలు సమస్యల పరిష్కారం కోసం ఎన్నో పోరాటాలు సీఐటీయూ నిర్వహించిందన్నారు. ఈ రంగాల్లో స్థానిక సమస్యలపై సమ్మెలు, ప్రభుత్వ కార్యాలయాల దిగ్బంధం, దశల వారి ఉద్యమాలు చేసి అనేక విజయాలు సాధించుకొన్నట్లు తెలిపారు. భవన నిర్మాణ, హమాలి రంగాలలో, పామాయిల్ కార్మికులకు ఈ కాలంలో 20 నుంచి 40శాతం వరకు వేతన ఒప్పందాలను చేసినట్లు పేర్కొన్నారు. అంగన్వాడీ రంగంలో అంగన్వాడీ కేంద్రాలకు స్టాక్ సప్లై చేయాలని, జనాభా ప్రాతిపదికన అంగన్వాడీ కేంద్రాలను కుదించి ఆలోచన విరమించుకోవాలని, పెండింగు టీఏ, డీఏలపై సమరశీల ఉద్యమాలు నిర్వహించి విజయాలు సాధించామని పేర్కొన్నారు. అత్యంత సంక్లిష్టమైన కరోనా రెండవ దశలో జిల్లాలో 25 లక్షల విలువచేసే నిత్యవసర వస్తువులను, మాస్కులను కార్మికులకు అందజేశామని అత్యంత ప్రతిష్టాత్మకంగా 72 రోజులు పాటు భద్రాచలంలో బీఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కరోనా ఉచిత ఐసోలేషన్ సెంటర్ నిర్వహణలో సీఐటీయూ కార్యకర్తలు కీలకంగా పనిచేశారన్నారు. భద్రాచలం, ఇల్లందు, కొత్తగూడెం, పాల్వంచ ప్రాంతాల్లో కరోనా మతదేహాలకు అంత్యక్రియలు కూడా నిర్వహించామని పేర్కొన్నారు. దుమ్ముగూడెం ఎస్ఎల్ఎస్ పవర్ ప్రాజెక్ట్‌లో పనిచేసే కార్మికుల వేతన ఒప్పంద సమస్యపై 45 రోజుల పాటు సమ్మె నిర్వహించి వేతనాలు పెంచుకున్నామని తెలిపారు. చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం ప్రాంతాల్లో మిషన్ భగీరథ కార్మికులు సమ్మె చేసి వేతనాలను పెంచుకున్నారని తెలిపారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో హాస్టల్లో పనిచేసే డైలీ వేజ్ వర్కర్లు 8 నెలలు పెండింగ్ వేతనాలను ఐదు రోజులపాటు సమ్మె చేసి పెంచుకున్నారని తెలిపారు. 36 గంటలు ఐటిడిఏ దీక్షలు నిర్వహించామన్నారు. భద్రాచలం, సారపాక, దమ్మపేట, ములకలపల్లి మండలాల్లో గ్రామ పంచాయతీ కార్మికులు వేతనాలు ఇతర పెండింగ్ సమస్యలపై ఆరు రోజులపాటు సమ్మె చేసి సమస్యలు పరిష్కరించుకున్నారని పేర్కొన్నారు. జిల్లాలో కొత్తగూడెం భద్రాచలంలో ఉన్న ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కాంట్రాక్ట్ కార్మికులు మెరుపు సమ్మె చేసి వేతనాలు, ఇతర పెండింగ్ సమస్యలు పరిష్కరించుకున్నారని తెలిపారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై తగిన కార్యచరణను రూపకల్పన చేస్తున్నామని ఏజే రమేష్ వెల్లడించారు. తొలి రోజు కార్మిక ప్రదర్శన బహిరంగ సభ జరుగుతాయని, రెండవ రోజు ప్రతినిధుల మహాసభ ప్రారంభమవుతుందని పట్టణంలోని ప్రముఖులంతా ప్రారంభ సభకు హాజరుకావాలని ఆయన పేర్కొన్నారు.
మహాసభలను జయప్రదం చేయండి
కొత్తగూడెం : భద్రాచలంలో ఈనెల 16, 17 తేదీలలో జరగనున్న సిఐటియు జిల్లా మూడవ మహాసభలను విజయవంతం చేయాలని, 16వ తేదీన జరిగే కార్మిక ప్రదర్శన బహిరంగ సభను విజయవంతం చేయాలని సిఐటియు అనుబంధ సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ కొత్తగూడెం బ్రాంచి కార్యదర్శి విజయగిరి శ్రీనివాస్ పిలుపు నిచ్చారు. మంగళవారం గడల నరసింహారావు అధ్యక్షతనతో జరిగిన బ్రాంచి ఆఫీస్ బేరర్స్ సమావేశంలో విజయగిరి శ్రీనివాస్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సిఐటియు నిర్వహించే పోరాటాలలో కార్మికులు పాల్గొనాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు డి.వీరన్న, భూక్య రమేష్, బ్రాంచి నాయకులు వై.వెంకటేశ్వరరావు, కర్ల వీరస్వామి, సూరం అయిలయ్య, కె.రమేష్ బాబు, కె. సమ్మయ్య, నాజర్ తదితరులు పాల్గొన్నారు.