Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజా క్షేమాన్నే కాంక్షించా..
- ఆత్మీయులతో తుమ్మల
నవతెలంగాణ-అశ్వారావుపేట
పదవిలో ఉన్నా..లేకున్నా ప్రజల సంక్షేమం కోసమే పాటు పడ్డానని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంతో పాటు నేను ప్రాతినిద్యం వహించిన నియోజక వర్గాల అభివృద్ధి కోసం యజ్ఞంలా పని చేశానని చెప్పారు. మండలంలోని ఊట్లపల్లి సమీపంలో గల వెంకమ్మ చెరువు కట్టపై శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయం వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన కార్తీక వన భోజనాలకు హాజరైన అనంతరం అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నేను మాట్లాడే విషయాలను రాయొద్దు, రికార్డు చేయొద్దు అంటూ మీడియాను వారిస్తూనే తాను మనుసులో అనుకున్నంతా చెప్పేసారు. తాను 40 ఏళ్ళ రాజకీయ ప్రయాణంలో ఉద్ధండులైన ముఖ్యమంత్రులు నందమూరి తారక రామారావు, చంద్రబాబు నాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖర్‌తో కలిసి పని చేశానని, సత్తుపల్లి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఏ ముఖ్యమంత్రి నియోజకవర్గంలో జరగలేదని, అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, అంతేకాకుండా కొందరు ముఖ్యమంత్రుల నియోజకవర్గాల్లోనూ అభివృద్ధి చేసే అవకాశం సంతృప్తి కలిగించిందని అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలు తీసుకురావటమే తన ఏకైక లక్ష్యమని, గోదావరి జలాలను తీసుకొచ్చినప్పుడే తన జన్మకు సార్ధకత ఉంటుందని చెప్పారు. గోదావరి జలాల రాకతో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించ వచ్చని, భూగర్భ జలాలు సైతం పెరుగుతాయని తెలిపారు. 40 ఏళ్ల క్రితం నిజాం కాలం నాటి ఖమ్మం-రాజమండ్రి రోడ్డు తప్ప మరే గ్రామాలకు సరైన రోడ్లు లేవని, తర్వాత టీడీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌తో మాట్లాడి అశ్వారావుపేట-మల్కారం, వినాయకపురం నుండి వేలేరుపాడుకు రోడ్లు తీసుకొచ్చానని వివరించారు. హైద్రాబాద్ రింగ్ రోడ్డును, ఇప్పుడు రెండో రింగ్ రోడ్డు మంజూరులో నా ప్రమేయం ఉందని, నేను ఏ ప్రభుత్వంలో పని చేసినా ఆయా ముఖ్యమంత్రులకు మంచి పేరు, ప్రతిష్టలు తీసుకొచ్చానని అన్నారు. ఆయిల్ పాం రైతు సమస్యలు కూడా తన దృష్టిలో ఉన్నాయని, ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుని నూనె పై ఇంపోర్ట్ డ్యూటీ ఉండేదని, అప్పుడు గెలల ధర ఎక్కువగా వచ్చిందని, ఇప్పుడు ఇంపోర్ట్ డ్యూటీని ఎత్తివేయటం వల్ల గెలల ధర తగ్గిందని, ఇదే విషయాన్ని భద్రాచలం పర్యటనలో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళానని, ఇంపోర్ట్ డ్యూటీ పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని కోరినట్లు తెలిపారు. ఇంపోర్ట్ డ్యూటీ ఉంటే స్థానికంగా ఆయిల్ గెలలు ధర టన్నుకు రూ.2 వేల వరకు పెరుగుతుందని, ఒక శాతం రికవరీ తగ్గినా మొత్తం రైతులు నష్టపోతారని చెప్పారు. నాకు రాజకీయ బిక్ష పెట్టిన అశ్వారావుపేట నియోజకవర్గాన్ని ఎక్కడ ఉన్నా, ఏ పదవిలో ఉన్న ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోనని ప్రకటించారు. సమావేశంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు డీకేఎం మహీపాల్, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కోటగిరి సీతారామస్వామి, కాసాని వెంకటేశ్వరరావు, దమ్మపేట జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, డీసీసీబీ డైరెక్టర్ నిర్మల పుల్లారావు, అశ్వారావుపేట సొసైటీ అధ్యక్షులు చిన్నంశెట్టి సత్యనారాయణ, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు సంకా ప్రసాద్, కాసాని చంద్ర మోహన్, తాడేపల్లి రవి, యూఎస్ ప్రకాశ్ రావు, తదితరులు ఉన్నారు.