Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్రీడలకు ఎంతగానో ప్రోత్సాహం : పీఓ
- విజయవంతంగా ముగిసిన గురుకుల రాష్ట్రస్థాయి క్రీడలు
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం గిరిజన గురుకుల విద్యాసంస్థ ప్రాంగణంలో గత నాలుగు రోజులుగా నిర్వహించిన బాలికల రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు మంగళవారం విజయవంతంగా ముగిశాయి. సాయంత్రం జరిగిన క్రీడల ముగింపు వేడుకకు ఎస్పీ వినీత్, పీఓ గౌతమ్ పోట్రు ముఖ్య అతిథులుగా హాజరై గెలుపొందిన బాలికలకు బహుమతి ప్రధానం చేశారు. అంతకుముందు భద్రాచలం గిరిజన గురుకులంకు చేరుకున్న వారికి సాంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సభలో...ఎస్పీ మాట్లాడుతూ... బాలికలు విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని సూచించారు. దేశానికి చెందిన ఎంతో మంది యువతులు వివిధ క్రీడా పోటీల్లో రాణించి ఉన్నత స్థానాల్లో నిలబడ్డారని గుర్తు చేశారు. పీఓ మాట్లాడుతూ...క్రీడలు అభివృద్ధి కోసం ఎంతగానో ప్రోత్సహం అందజేస్తున్నామని తెలిపారు. ఇటువంటి అవకాశాలను బాలబాలికలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సొసైటీ ద్వారా క్రీడల అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఐటీడీఏ ఏపీవో జనరల్ ఆర్సీఓ హెచ్ డేవిడ్ రాజు మాట్లాడుతూ...రాష్ట్రస్థాయి క్రీడలకు హాజరైన బాలికలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. కార్యక్రమంలో నల్గొండ ఆర్సీఓ లక్ష్మయ్య, వరంగల్ ఆర్సీఓడీఎస్ వెంకన్న, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆర్సిఓ ఏవి రాజ్యలక్ష్మి, మహబూబ్ నగర్ ఆర్సిఓ నాగార్జున, భద్రాచలం గిరిజన గురుకుల కళాశాల, పాఠశాల ప్రిన్సిపాల్ ఎం.దేవదాసు, గేమ్స్ ఇన్చార్జి జి.మాధవి, మణుగూరు గురుకులం ప్రిన్సిపాల్ ఏ.పద్మావతి, తదితరులు పాల్గొన్నారు.
మెగా ఛాంపియన్గా జోన్ 3
భద్రాచలం గిరిజన గురుకుల విద్యాసంస్థ ప్రాంగణంలో నిర్వహించిన 6వ రాష్ట్రస్థాయి గిరిజన బాలికల పోటీల్లో మెగా ఛాంపియన్ జోన్ 3కి రాగా, గేమ్స్ అండర్- 19,17,14 ఛాంపియన్ షిప్ కూడా జోన్-3కి లభించింది. అథ్లెటిక్స్ అండర్ 14, 17,19 విభాగంలో కూడా జోన్-3కి ఛాంపియన్ షిప్ లభించింది. అథ్లెటిక్స్ వ్యక్తిగత ఛాంపియన్షిప్ అండర్ 14లో ఇందు భద్రాచలం, అండర్ 17 విభాగంలో తేజశ్రీ భద్రాచలం, అండర్ 19 విభాగంలో హరిత ఎల్లారెడ్డిపేట పొందారు.