Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నందిపాటి మనోహర్
- కలెక్టరేట్ ఎదుట కెవిపిఎస్ ధర్నా
నవతెలంగాణ-ఖమ్మం
రాష్ట్రం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన దళిత బంధు రూ. 10 లక్షల రూపాయలను ప్రతి ఎస్సీ కుటుంబానికి అందజేసి మాట నిలబెట్టుకోవాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) జిల్లా ప్రధాన కార్యదర్శి నందిపాటి మనోహర్ డిమాండ్ చేశారు. గురువారం ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ధర్నా చౌక్ లో కెవిపిఎస్ ఆధ్వర్యంలో దళితుల ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కెవిపిఎస్ ఖమ్మం త్రీ టౌన్ నాయకులు ఎస్.కె. సైదులు అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి అయన మాట్లాడుతూ ప్రతి ఎస్సీ కుటుంబానికి 10 లక్షల రూపాయల దళిత బంధు, ఉచిత విద్యుత్, ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఇవ్వాలని, దళిత వాడల సమస్యలను పరిష్కరించాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెచ్చిన దళిత బంధు పథకాన్ని కొందరికే పరిమితం చేయకుండా ప్రతి దళిత కుటుంబానికి అందేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. దళిత బంధు పేరుతో ఎస్సీ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేయడం సరైనది కాదని, గత నాలుగేళ్లుగా ఎస్సీలకు ఋణాలివ్వకుండా మోసం చేయడం దుర్మార్గమన్నారు. కొత్త యాక్షన్ ప్లాన్ తక్షణమే తీసుకొచ్చి ఎలాంటి కొర్రీలు లేకుండా రుణాలు మంజూరు చేయాలని, 342 జీఓ ప్రకారం ప్రతి దళిత కుటుంబానికి 101 యూనిట్ల నుండి 300 యూనిట్లకు పెంచి ఉచిత విద్యుత్ ను సరఫరా చేయాలని, సంక్షేమ హాస్టళ్లలో చలికాలంలో కనీస వసతులైన దుప్పట్లు, రగ్గులు, దోమల తెరలు, మౌళిక సౌకర్యాలు కల్పించాలని, వారు డిమాండ్ చేశారు. కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షురాలు మాచర్ల భారతి మాట్లాడుతూ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత దళితులపైన, మహిళలపైన అనేక దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, హింస పెరిగిపోయిందన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్‌కు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. కలెక్టర్ స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు ముత్తమాల ప్రసాద్, జిల్లా ఆఫీస్ బేరర్స్ బొట్ల సాగర్, పాపిట్ల సత్యనారాయణ, మట్టి దుర్గాప్రసాద్, కుక్కల సైదులు, మాగి భద్రయ్య, నాయకులు గుర్రం ఉపేందర్, అరేంపుల ఉప్పలయ్య, లింగాల చిన్న దానయ్య, జంగం నగేష్, సారయ్య, మండల వీరస్వామి, కాంపాటి రామస్వామి తదితరులు పాల్గొన్నారు.