Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాగని చెన్నాపురం డబుల్ రోడ్డు
- చిత్ర విచిత్ర సమాధానాలతో అధికార యంత్రాంగం
- అవస్థలు పడుతున్న గిరిజనం
నవతెలంగాణ-చర్ల
అత్త బారేడు అంటే... కోడలు మూరెడన్న చందంగా కేసీఆర్ ప్రభుత్వంలో నిర్మాణ పనులు సాగుతున్నాయని పలువురు బాహాటంగా విమర్శిస్తున్నారు. దానికి ప్రత్యక్ష నిదర్శనం నత్తనడక కన్నా హీనంగా సాగుతున్న కలివేరు నుండి చెన్నాపురం వరకు జరుగుతున్న డబల్ రోడ్డు నిర్మాణ పనులని గిరిజను విమర్శిస్తున్నారు. కలివేరు క్రాస్ రోడ్ నుండి చెన్నాపురం వరకు ఎల్ డబ్ల్యు ఎస్ రాష్ట్ర నిధుల సుమారు రూ.32 కోట్ల నిధుల నుండి 21 కిలోమీటర్ల డబల్ బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టడానికి 2019 ఆర్థిక సంవత్సరంలో గుత్తేదారులు టెండర్లు పొందారు. టెండర్లు దక్కించుకున్న గుత్తెదారులు నేనంటే, నేనంటూ పోటా పోటీగా 2022 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో పనులు ప్రారంభించి ఓ...తెగ హడావిడి చేసిన గుత్తేదారులు ఒకరిపై మరొకరు న్యాయస్థానాల వరకు వెళ్లి మరి చివరాఖరకు ఒకే ఒక కాంట్రాక్టర్ డబల్ రోడ్డు నిర్మాణం పనులు చేపట్టే విధంగా ప్రతిపాదనలు తెచ్చుకోవడం జరిగింది. నాటినుండి మధ్యంతరంగా నిర్మాణ పనులు నిలిపివేసి అమావాస్య, పౌర్ణమికో ఒక్కసారి వచ్చి ఏదో అలా ఇలా పనులు చేసినట్లు అభినయం ప్రదర్శిస్తూ నత్త నడక కన్నా దీనంగా రోడ్డు పనులు చేస్తున్నారని ఆ ప్రాంత ప్రజలు మండిపడుతున్నారు.
దుబ్బ కొట్టుకుపోతున్న ఆదివాసి గ్రామాలు
మా గ్రామాల మీదుగా డబల్ రోడ్డు వచ్చిందని ఎంతో ఆశగా ఉన్న ఆదివాసి గ్రామాలన్నీటి పై దుబ్బ కొట్టుకుపోతుంది. నిత్యం రద్దీగా ఉండే రహదారి కావడం సగం వరకు నిర్మాణ పనులు చేపట్టి బిటి వేయకపోవడం వలన వాహనాలు రాకపోకలు సాగించినప్పుడు పొలోమని దుబ్బలేసి ఇళ్లల్లోకి చేరు తుందని ఆదివాసులు ఆందోళన చెందుతున్నారు. రోడ్డుపై దుబ్బ అంతా ఇంట్లోకి వస్తుందని మహిళలు నవతెలంగాణతో మొరపెట్టుకున్నారు.
చిత్ర విచిత్ర సమాధానాలతో అధికారి యంత్రాంగం
కాంట్రాక్టర్లు మారడం, ఫారెస్ట్ క్లియరెన్స్ లేదనడం, వర్షాలు వచ్చాయనడం, ఆరోగ్య పరిస్థితి బాగాలేదు అనడం ఇలా కర్ణుడి చావుకి వంద కారణాలు అన్న చందంగా చిత్ర విచిత్రంగా అధికారలు రోడ్డు నిర్మాణం పనుల నిలుపుదలపై సమాధానాలు ఇస్తున్నారు. అధికారుల అండదండతో గుత్తేదారు సైతం నిమ్మకు నీరు ఎత్తిన చందంగా వ్యవహరిస్తూ రోడ్డు నిర్మాణ పనులు 20 శాతం కూడా పూర్తి చేయకుండా గ్రామస్తుల మాట వినకుండా తాను ఇష్టానికి వ్యవహరిస్తున్నాడని ఆదివాసీలు మండిపడుతున్నారు.
అవస్థలు పడుతున్న గిరిజనం
కొన్ని వేల మంది అటు చతిస్గడ్ పామేడు, ధర్మారం, తొంగుడం, యాంపురం, జెరుపల్లి తోపాటు ఇటు తెలంగాణ ఎర్రంపాడు, చెన్నాపురం, తిప్పాపురం, బత్తెనపల్లి రాల్లాపురం, ఉయ్యాలమడుగు పెద్దమిడిసిలేరు, ఎన్ కొత్తూరు, బి కొత్తూరు, తిమ్మిరి గూడెం, కుష్టారం పాడు, చిన్న మిడిసి లేరు, అంజనాపురం, జంగాలపల్లి గ్రామాల ఆదివాసీల తోపాటు, ధర్మారం, పామేడు, తోంగుడం చలమలకు చెందిన సిఆర్పిఎఫ్ బెటాలియన్ ఈ మార్గం గుం డానే రాకపోకలు సాగించాల్సి ఉంది. వర్షాకాలం ప్రా రంభంలో ఉరుకుల పరుగులతో పనులు ప్రారం భించిన గుత్తేదారు సగం చేసి వదిలిపెట్టడం వలన ఇటు పోలీస్ సిబ్బంది, అటు ప్రజలు వర్షాకాలం అంతా నానావస్థలు పడాల్సి వచ్చిందని పోలీసు ఉన్నతాధికారులు సైతం నవతెలంగాణకు తెలిపారు.
నాణ్యతకు తిలోదకాలు ఇచ్చిన గుత్తేదారు
కోట్ల రూపాయలతో టెండర్లు దక్కించుకున్న గుత్తేదారు నిర్మాణ పనుల్లో నాణ్యత నవ్వే విధంగా నిర్మాణ పనులు చేపడుతున్నారని ఇక్కడ ప్రజలు మండిపడుతున్నారు. కట్టుబడికి కూడా వాడని పునాదుల్లో పోసే తాలిపేరు ఉసుకతో ఏకంగా వంతెనలు నిర్మిస్తూ ఉంటే అధికార యంత్రాంగం మాత్రం నిద్రవస్తలో ఉందని ఆదివాసీల ఆందోళన చెందుతున్నారు. కాంక్రీట్ పనులు చేస్తున్నప్పుడు సైతం సంబంధిత జేఈ, డీఈ పర్యవేక్షించకుండానే సిమెంట్ తక్కువ, ఇసుక ఎక్కువ వాడి నిర్మాణ పనులు చేపిస్తున్నారని ప్రజలు ఆక్షేపిస్తున్నారు. ఇకనైనా కలెక్టర్, ఐటీడీఏ పీవో కలివేరు నుండి చెన్నాపురం వరకు నిర్మాణం చేపడుతున్న డబల్ బీటీ రోడ్డుపై దృష్టి సారించి నాణ్యతగా త్వరతిగతిన పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఆదివాసీ ప్రజలు కోరుతున్నారు.
నాణ్యత లేకుండా.. వాళ్లకిష్టమైనప్పుడు రోడ్డు పనులు చేస్తున్నారు
ఎంపీటీసీ : పాలంచ రామారావు
నాణ్యత లేకుండా ఇష్టానుసారంగా కాంట్రాక్టర్ రోడ్డు పనులు చేస్తున్నాడు. డస్ట్ పోసి వదిలేయడం వలన వచ్చి పోయే వాహనాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అదే మిటి అని అడిగితే ఇటు అధికా రులు, అటు గుత్తేదారు సరైన సమాధానం చెప్పకుండా ఇష్టా నుసారంగా వ్యవహరిస్తున్నారు. కలెక్టర్, పీఓ అధికారులపై చర్యలు చేపడితేనే కానీ మా రోడ్డు బాగుపడదు.
మా ఇల్లు దుబ్బ కొట్టుకుపోతున్నాయి...
జి.పృద్వి, చిన్న విడిచి లేరు గ్రామం
డబల్ రోడ్డు నిర్మాణ పనులు అస్తవ్యస్తగా ఉన్నాయి. రెండు రోజులు జరిగితే నెల రోజులు ఆగిపోతుంది. రోడ్డుమీద పోసిన డస్ట్ వలన వాహనాలు వచ్చి పోయినప్పుడు డస్ట్ అంతా మా ఇళ్లల్లోకి వచ్చి నానా ఇబ్బంది అవుతుంది. రోడ్లు తడపకుండా కాంట్రాక్టర్ తన ఇష్టానికి వ్యవహరిస్తున్నాడు ఉన్నతాధికారులు దృష్టి సారించి ఇటు కాంట్రాక్టర్ పైన, అటు ఆర్ అండ్ బి అధికారుల పైన చర్యలు చేపట్టాలని కోరుతున్నాం.
గుత్తేదారుపై చర్యలు చేపడతాం
ఆర్అండ్బీ డీఈ హరిలాల్
సంబంధిత గుత్తేదారు అలసత్వం వీడే విధంగా చర్యలు చేపడతాం. కలివేరు నుండి చెన్నాపురం వరకు 21 కిలోమీటర్ డబల్ రోడ్డు నాణ్యంగా నిర్మించడానికి పర్యవేక్షణ చేపడతాం.