Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు
నవతెలంగాణ-ఖమ్మం
రాష్ట్రంలోని పోడుసాగుదారులకు పట్టాలను అందించే విషయంలో పారదర్శకతతో వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు సూచించారు. మంగళవారం నగరంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోడు పట్టా దారుల ఎంపిక కోసం ప్రభుత్వం కార్టోశాట్ శాటిలైట్ సర్వేను ఆధారంగా చేసుకోవడం సరియైనది కాదన్నారు. ఇది పారదర్శకతతో కూడినది కాదన్నారు. 2005 డిసెంబర్ 13 కన్నా ముందు సాగులో ఉంటేనే పట్టాలు ఇవ్వాలని నిర్ణయించడం సరియైనది కాదన్నారు. రాష్ట్రవ్యాప్తం 2450 గిరిజన గ్రామాల నుంచి 4.14 లక్షల మంది 13.18లక్షల ఎకరాల కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఎన్నికల కోసం ఆదివాసీలను వంచించవద్దన్నారు. ప్రజలకు జీవిత భద్రత ఇచ్చే పాడు హక్కు పత్రాలు త్వరగా ఇవ్వాలన్నారు. అవినీతి, అక్రమాలకు తావులేకుండా ఈ కార్యక్రమాన్ని తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పోడు సాగుదారులందరికీ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాగ్ధానాలపై దష్టిపెట్టకుండా ప్రజలను వంచిస్తున్నాయని విమర్శించారు. కేంద్రం దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఎస్ఐ, ఈడీలను దుర్వినియోగం చేస్తుందని విమర్శించారు. గవర్నర్ వ్యవస్థనూ కీలుబొమ్మగా మార్చుతున్న దుస్థితి కనిపిస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రజాసమస్యలను రాష్ట్రప్రభుత్వం గాలికొదిలేసిందన్నారు. విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి గోకినపల్లి వెంకటేశ్వరరావు, నాయకులు ఆవుల వెంకటేశ్వర్లు, సీవై పుల్లయ్య, అశోక్, శివలింగం, తదితరులు పాల్గొన్నారు.