Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమల శాఖ అధికారి జి.అనసూయ
నవతెలంగాణ-తల్లాడ
ఆయిల్ ఫామ్ పంట సాగు చేసుకునే రైతులకు 193 రూపాయల విలువగల మొక్కను రాయితీపై 20 రూపాయలకు అందిస్తున్నట్లు జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమల శాఖ అధికారి జి అనసూయ తెలిపారు. మండల పరిధిలోని కుర్నవల్లి గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఆయిల్ ఫామ్ పంటపై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. అనసూయ మాట్లాడుతూ డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేసుకునేందుకు ఎస్టి, ఎస్సి రైతులకు నూరు శాతం, బిసి, ఓసి ఐదు ఎకరాల లోపు 90 శాతం ఓసి 5 ఎకరాల పైన 80 శాతం రాయితీపై డ్రిప్ పరికరాలు అందజేస్తామన్నారు. పంట వేసిన నాలుగు సంవత్సరాల వరకు ఎకరాకు 2100రూపాయలు, అంతర పంటలు సాగు చేస్తే మరో 2100, ప్రోత్సాహకంగా అందజేస్తామన్నారు. ఆసక్తి గల రైతు సోదరులు సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి డివిజన్ ఆర్టికల్చర్ అధికారి మీనాక్షి మాట్లాడుతూ మిర్చి పంటలో ప్రస్తుతం నల్ల తామర పురుగు కనిపిస్తుందని దాని నివారణకు ఎకరాకు 42, 50 నీలిరంగు అట్టలు అమర్చాలని అన్నారు. వేప నూనె పిచ్చికారి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కుర్నవల్లి గ్రామ సర్పంచ్ ఐలూరు లక్ష్మి, కలకొడిమ గ్రామ రైతుబంధు సమితి కోఆర్డినేటర్ షేక్ హసన్, ఏ ఈ ఓ నాగేశ్వరరావు, ఆయిల్ ఫెడ్ ఫీల్డ్ అసిస్టెంట్ హర్షిత, రైతులు పాల్గొన్నారు.