Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామసభల్లో ఏకగ్రీవ తీర్మానం
- సర్వేలో ఫారెస్టు జోక్యం వద్దు : సీపీఐ(ఎం)
నవతెలంగాణ-కారేపల్లి
ప్రత్యామ్నాయ పోడు చూపకుండా ప్లాంటేషన్ చేసిన పోడుదారులందరికీ ప్లాంటేషన్ పోడుకు హక్కు కల్పించాల్సిందేనంటూ గ్రామ సభల్లో ఏకగ్రీవ తీర్మానాలు జరిగాయి. కారేపల్లి మండలంలో పోడు హక్కుకు లబ్ధిదారులు పెట్టుకున్న దరఖాస్తులపై ఎఫ్ఆర్సీ ఆధ్వర్యంలో అధికారులు సర్వే నిర్వహించారు. ప్లాంటేషన్ ఉందని, చెట్లుతుప్పలు ఉన్నాయని ఫారెస్టు అధికారుల అభ్యంతరాలతో చాలా చోట్ల పోడును అధికారులు సర్వే చేయలేదు. దీనిపై గ్రామ సభల్లో చర్చకు వచ్చింది. ఎర్రబోడు గ్రామ సభకు పెద్దఎత్తున గ్రామస్తులు హాజరైనారు. మండలంలోని ఎర్రబోడు గ్రామంలో ఇటివల ప్లాంటేషన్ పోడుపై రగడ జరిగింది. ప్లాంటేషన్‌కు ప్రత్యామ్నాయం చూపకుండా ఏకపక్షంగా పోడును లాక్కొని ఫారెస్టు అధికారులు ప్లాంటేషన్ వేశారు. దానికి పక్కనే ఉన్న పోడును సైతం ఫారెస్టు అధికారులు సర్వేకు అంగీకరించకపోవటంతో వివాదం జరిగింది. దీంతో ప్లాంటేషన్‌ను కొందరు పోడుదారులు ధ్వంసం చేశారు. ఇది కేసుల వరకు వెళ్లింది. కారేపల్లి ఫారెస్టు రేంజ్ తాళ్లగూడెం సెక్షన్, ఊట్కూర్ నార్త్ భీట్ పరిధిలో 150 ఎకరాల్లో ప్లాంటేషన్ వేయాలనే ఫారెస్టు అపధికారులు ప్రపోజల్స్ పెట్టుకున్నారు. దానిలో భాగంగా ఇతర పోడుదారులతో చర్చించి 28 మంది ప్లాంటేషన్ బాధితులకు ప్రత్యామ్నా పోడును చూపుతామంటూ మూడెండ్ల క్రితం 75 ఎకరాల్లో ప్లాంటేషన్ వేశారు.ప్లాంటేషన్ నిర్వాసితులకు అధికారులు మొండి చేయి చూపారు. ఈ 75 ఎకరాలకు పక్కనే 24 మందికి చెందిన మరో 75ఎకరాలలోకి మూడెండ్లుగా పోడుసాగుదారులను వెళ్లనీయటం లేదు.
సర్వేలో ఫారెస్టు జోక్యం వద్దు
పోడు హక్కు కోసం నిర్వహిస్తున్న సర్వేలో ఫారెస్టు జోక్యం ఉండవద్దని గ్రామసభల్లో ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సర్వే పూర్తిగా ఎఫ్ఆర్సీ కమిటీ గ్రామసభ తీర్మానంకు లోబడి చేయాల్సిందేనని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భూక్యా వీరభద్రం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొండెబోయిన నాగేశ్వరరావు, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కే.నరేంద్రలు డిమాండ్ చేశారు. చెట్లు ఉన్నాయని, పుట్టలున్నాయంటూ సర్వేకు ఫారెస్టు అడ్డంకులు సృష్టిస్తుందన్నారు. కారేపల్లి మండలంలో 2083 మంది దరఖాస్తుదారుల పోడు సర్వే జరగాలన్నారు. ఫారెస్టు అభ్యంతరాలు చెప్పుతుందని, గ్రామసభ తీర్మానంతో పోడును సర్వే చేసి హక్కులు కల్పించాలని వారు అధికారులను కోరారు.
హక్కుకు ఢిల్లీ ప్రమాదం ఉంది
అటవీ హక్కులకు డిల్లీ ప్రమాదం పొంచి ఉందని దానిని ఐక్యంగా తిప్పి కొట్టాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భూక్యా వీరభద్రం అన్నారు. ఎర్రబోడు గ్రామసభలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అటవీ హక్కులు ఇస్తుంటే దానిపై రద్దు చేసి అడవులను కార్పొరేట్ సంస్ధలకు కట్టబెట్టాలని కేంద్రంలోని మోడీ అటవీ సంరక్షణ చట్టం తెస్తుందన్నారు. పోడుదారులకు సీపీఐ(ఎం) అండగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వ చర్యలను తిప్పికొడదామన్నారు. గ్రామసభలో జడ్పీటీసీ వాంకుడోత్ జగన్, సర్పంచ్ కుర్సం సత్యనారాయణ, ఎంపీటీసీ శివరాత్రి పార్వతి, ఎప్ఆర్సీ చైర్మన్ వజ్జా రామారావు, ఎంపీడీవో చంద్రశేఖర్, తహసీల్ధార్ కోట రవికుమార్, ఎస్సై పి.రామారావు, కార్యదర్శి ప్రవీణ్‌కుమార్, ఏఈవో నరేష్, మాజీ సోసైటీ చైర్మన్ ఈసాల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.