Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- వైరాటౌన్
సమాజంలో సగభాగం ఉన్న మహిళలపైన రోజురోజుకు అత్యాచారాలు, హింస పెరిగిపోతు న్నాయని, హింసలేని సమాజాన్ని నిర్మించాలని ఐద్వా జిల్లా కార్యదర్శి మాచర్ల భారతి కోరారు. స్థానిక మధు డిగ్రీ కళాశాలలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) వైరా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం మచ్చా మణి అధ్యక్షతన సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాచర్ల భారతి మాట్లాడుతూ పాలకులు ఎవరు మారినా మహిళలను రెండో తరగతి పౌరులుగా చూపిస్తూ వారి వ్యాపార అవసరాలకు వాడుకుంటూ తమ సంకుచిత రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చు కుంటున్నారని విమర్శించారు. బిజెపి ప్రభుత్వం మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేస్తూ మహిళలు వంటింటికే పరిమితం కావాలని, మహిళలు వేసుకునే దుస్తులు కారణంగా అత్యాచారాలు జరుగుతున్నాయంటూ అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తుందని విమర్శించారు. పాలకుల రాజకీయ ఒత్తిడిల వలన మహిళలకు న్యాయం జరిగే పరిస్థితి లేదని, న్యాయం కోసం మహిళలు నిరంతరం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మధు విద్యాసంస్థల కోశాధికారి మల్లెంపాటి నర్మదా, ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు మెరుగు రమణ, నాయకురాళ్లు తోట కృష్ణవేణి, నర్వనేని ఆదిలక్ష్మి, చావా కళావతి, తాటి కృష్ణకుమారి పాల్గొన్నారు.