Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పత్తి మార్కెట్లో రెండు గంటల పాటు నిలిచిన కొనుగోళ్లు
- 28 నుంచి నిరవధిక సమ్మెకు సమాయత్తం
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
జీఎస్టీ బాదుడిపై ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో వ్యాపారులు కన్నెర్ర చేశారు. జీఎస్టీ విధానాన్ని వ్యతిరేకిస్తూ రెండు గంటల పాటు ఆందోళన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ జీఎస్టీ విధానము అత్యంత లోపభూయిష్టంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాపారుల ధర్నా కారణంగా మార్కెట్లో పత్తి కొనుగోళ్లు దాదాపు రెండు గంటల పాటు నిలిచిపోయాయి. ప్రతి పంట ఉత్పత్తికి అమ్మకం మీద పన్ను చెల్లించాలి. కానీ దానికి భిన్నంగా పత్తి కొనుగోళ్ల విషయంలో వ్యవహరిస్తుండడంపై మండిపడ్డారు. అమ్మకం మీద కాకుండా కొనుగోళ్లపై జీఎస్టీ విధిస్తుండడాన్ని వ్యాపారులు నిరసించారు. వ్యాపారుల ఆందోళన కారణంగా కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు ఇబ్బంది పడ్డారు. మార్కెట్ కార్యదర్శి రుద్రాక్షల మల్లేశం జోక్యం చేసుకొని వ్యాపారులతో చర్చించారు. కొనుగోళ్లు కొనసాగించేలా చర్యలు తీసుకున్నారు. వ్యాపారుల ఆందోళనకు సిఐటియు జిల్లా నాయకులు బండారు యాకయ్య మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పతి అసోసియేషన్ ఉపాధ్యక్షులు గొడవర్తి శ్రీనివాసరావు, జిల్లా బాధ్యులు నల్లమల ఆనంద్, మన్నెం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.