Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీడీవో కార్యాలయం ఎదుట సర్పంచుల బైఠాయింపు
- నేటి నుంచి విధులు బహిష్కరిస్తాం
నవతెలంగాణ-చండ్రుగొండ
పంచాయతీల లేమితో పంచాయతీల విధులు నిర్వహించలేమని వినతి పత్రాన్ని సర్పంచులు ఎంపీడీవో అన్నపూర్ణకు అందజేశారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే పంచాయతీలకు రావలసిన బకాయిలను అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుండి రావలసిన నిధులను సత్వరమే విడుదల చేయాలని కోరారు. ఈ సందర్భంగా సర్పంచుల అధ్యక్షుడు పద్దం వినోద్ మాట్లాడుతూ ప్రభుత్వం తమకు రావలసిన నిధులు విడుదల చేయకపోతే మా పరిస్థితి అగమ్య గోచరమని, అప్పులు ఇచ్చే పరిస్థితి కూడా లేదని, ఇబ్బడి ముబ్బడిగా ఇప్పటికే ఉన్న బాకీలకు వడ్డీలు పెరిగి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నామన్నారు. పారిశుధ్య పనులకు సైతం నిర్వహించలేని పరిస్థితి పంచాయతీలకు ఏర్పడిందన్నారు. అప్పుల వాళ్ళ ఒత్తిడి వల్ల తీవ్ర మనోవేదనకు గురవుతున్నామని, దిక్కు తోచని పరిస్థితుల్లోనే ముకుమ్మడిగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, విధులకు హాజరు కాలేమని అన్నారు. వినతి పత్రాన్ని స్వీకరించిన ఎంపీడీవో అన్నపూర్ణ మాట్లాడుతూ ఈ విషయాన్ని వెంటనే కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో బెండలపాడు సర్పంచ్ వెంకటేశ్వర్లు, వెంకటయ్య తండా సర్పంచ్ బాలాజీ, తుంగారం సర్పంచ్ బానోత్ కుమారి, రేపల్లెవాడ సర్పంచ్ కాకా శ్రీనివాస్, గుర్రాయి గూడెం సర్పంచ్ కాక సీత, తిప్పనపల్లి సర్పంచ్ ధారావత్ పార్వతి తదితరులు పాల్గొన్నారు.