Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా రాష్ట్ర నాయకురాలు బుగ్గవీటి సరళ
నవతెలంగాణ-కొణిజర్ల
మహిళలపై హింస లేని సమాజం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని ఐద్వా రాష్ట్ర నాయకురాలు బుగ్గవీటి సరళ అన్నారు. మండల పరిధిలోని చిన్నగోపతి గ్రామంలో ఐద్వా మండల కమిటీ సభ్యురాలు కొచ్చెర్ల కూమారి అధ్యక్షతన జరిగిన సదస్సులో ఐద్వా జిల్లా అధ్యక్షకార్యదర్శులు మాచర్ల భారతి, బండి పద్మలు మాట్లాడుతూ నేటి సమాజంలో స్త్రీలు సామాజికంగా, రాజకీయంగా హింస రూపంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. నూటికి నలబై శాతం మంది మహిళలు పురుషాధిక్యతతో నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం మహిళలు పురుషులతో సమానంగా చదువుతూ, అన్ని రంగాల్లో స్త్రీల హక్కుల పరిరక్షణ కోసం పనిచేస్తూ ముందుకు సాగుతున్నారన్నారు. ప్రధానంగా మహిళలు, పిల్లలపై దాడులు, హత్యలు, లైంగికదాడులు, హింస పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తుందన్నారు. కర్నాటక, బీహార్, అస్సాం, తెలంగాణ, మిజోరాం, నాగాలాండ్ రాష్ట్రాల్లో గృహహింస రోజురోజుకూ పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. హింస లేని సమాజాన్ని తీసుకురావడం కోసం ప్రభుత్వాలు తమ మేనిఫెస్టోలో సరైన విధానాలను పొందు పరచాలని కోరారు. ప్రభుత్వ విధానాల్లో, పురుషులు ఆలోచనా విధానాల్లో మార్పులు వచ్చినప్పుడు మాత్రమే హింసలేని సమాజాన్ని స్థాపించడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. విద్య, క్రీడలు, సైన్స్ రంగాల్లో మహిళలు ముందుకు పోతున్నప్పటికీ ఇంకా ఒదిగి ఉండాలనే పితృస్వామ్య భావజాలాన్ని కొనసాగించడం దుర్మార్గమైన చర్య అన్నారు. మహిళల హక్కులు, చట్టాలను కాపాడుకునేందుకు పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఇటీవలే గరికపాటి నరసింహ రావు రాందేవ్ బాబా మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై వారు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా ఉపాద్యక్షురాలు మెరుగు రమణ, బొలమాల సరోజిని, లింగాల కూమారి, జూపూడి పద్మ, బుర్రి నిర్మల, కూమారి తదితరులు పాల్గొన్నారు.